బాదేసిన బట్లర్‌

Apr 17,2024 09:20 #Sports
  • ఐపిఎల్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించిన రాజస్తాన్‌
  • కోల్‌కతాపై రెండు వికెట్ల తేడాతో గెలుపు

కోల్‌కతా: ఈడెన్‌ గార్డెన్స్‌లో పరుగుల మోత మోగింది. కోల్‌కతా నిర్దేశించిన 224పరుగుల లక్షాన్ని రాజస్తాన్‌ జట్టు చివరి బంతికి ఛేదించింది. దీంతో రాజస్తాన్‌ ఐపిఎల్‌ చరిత్రలో రెండోసారి రికార్డు ఛేదన చేసిన జట్టుగా రికార్డుపుటల్లోకెక్కింది. మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిర్దేశించిన 224పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్తాన్‌ ఓపెనర్‌ బట్లర్‌(107నాటౌట్‌; 60బంతుల్లో 9ఫోర్లు, 6సిక్సర్లు) కీలకపాత్ర పోషించాడు. బట్లర్‌కు తోడు రియాన్‌ పరాగ్‌(34), రువన్‌ పావెల్‌(26) సహకారం అందించారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ బట్లర్‌కు లభించింది. అంతకుముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌(109) సెంచరీ కదం తొక్కాడు. దీంతో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 223పరుగులు చేసింది. తొలుత ఫిలిప్‌ సాల్ట్‌(10)ను అవేశ్‌ ఖాన్‌ వెనక్కి పంపడంతో 21 పరుగుల వద్ద కోల్‌కతా మొదటి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత యువకెరటం అంగ్‌క్రిష్‌ రఘువంశీ(30) క్రీజ్‌లో వచ్చీ రావడంతోనే ధనాధన్‌ బ్యాటింగ్‌లో చెలరేగాడు. అయితే.. కుల్దీప్‌ సేన్‌ ఓవర్లో అశ్విన్‌ చేతికి చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన అయ్యర్‌(11) మళ్లీ త్వరగా వికెట్‌ పారేసుకున్నాడు. ఆ దశలో క్రీజులోకి వచ్చిన ఆండ్రూ రస్సెల్‌(13) అండతో నరైన్‌ మరింత రెచ్చిపోయాడు. చాహల్‌ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 49 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శతకంతో జోరు మీదున్న నరైన్‌ను బౌల్ట్‌ సూపర్‌ యార్కర్‌తో బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత రింకూ సింగ్‌(20నాటౌట్‌), వెంకటేశ్‌ అయ్యర్‌(8)లు ధాటిగా ఆడి కోల్‌కతాకు భారీ స్కోర్‌ అందించారు. రాజస్థాన్‌ బౌలర్లలో అవేశ్‌ ఖాన్‌, కుల్దీప్‌ సేన్‌లు తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.
మూడో కోల్‌కతా ప్లేయర్‌
ఐపిఎల్‌లో వంద కొట్టిన మూడో కోల్‌కతా ఆటగాడిగా నరైన్‌ రికార్డు సృష్టించాడు. అతడి కంటే ముందు బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌, వెంకటేశ్‌ అయ్యర్‌లు కేకేఆర్‌ తరఫున సెంచరీలు బాదారు. ఐపిఎల్‌ ఆరంభ సీజన్‌లో మెక్‌కల్లమ్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై సెంచరీతో చెలరేగాడు. ఆ మ్యాచ్‌లో బ్రెండన్‌ 158నాటౌట్‌గా నిలిచాడు. నిరుడు సీజన్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌ ముంబయి ఇండియన్స్‌పై శతకం(104) సాధించాడు. ఆ జాబితాలో నేడు సునీల్‌ నరైన్‌(109) చేరాడు.
ఛేదనలో జైస్వాల్‌(19) మరోసారి నిరాశపరిచాడు. కెప్టెన్‌ సంజు(12), జురెల్‌(2), అశ్విన్‌(8), హెట్‌మైర్‌(0) ఘోరంగా విఫలమయ్యారు. అయినా ఓపెనర్‌ బట్లర్‌ సెంచరీతో కదం తొక్కి పట్టువదలని విక్రమార్కుడిలా చివరి బంతి వరకు క్రీజ్‌లో నిలిచిన రాజస్తాన్‌ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.

➡️