రేసులోకి బెంగళూరు

May 4,2024 23:20 #Cricket, #IPL, #rcb, #Sports
  •  గుజరాత్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపు
  •  హ్యాట్రిక్‌ విజయాలతో పై.. పైకి

బెంగళూరు: ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పని గెలవాల్సిన పోరులో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు సత్తా చాటింది. తొలుత గుజరాత్‌ టైటాన్స్‌ను 147పరుగులకే కట్టడి చేసి.. ఆ లక్ష్యాన్ని 13.4ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్‌ ఫాఫ్‌ డూప్లెసిస్‌(64) అర్ధసెంచరీకి తోడు.. విరాట్‌ కోహ్లీ(42) బ్యాటింగ్‌లో రాణించాడు. వీరిద్ద రూ తొలి వికెట్‌కు 92పరుగులు జతచేసి విజయ తీరాలకు చేర్చారు. చివర్లో ఫినిషర్‌ దినేశ్‌ కార్తిక్‌(21 నాటౌట్‌), యువ కరటం స్వప్నిల్‌ సింగ్‌(15 నాటౌట్‌)లు మిగతా పని కానిచ్చా రు. ఈ గెలుపుతో బెంగళూరు ఏడో స్థానానికి ఎగబాకింది.

లిటిల్‌ మ్యాజిక్‌..
పవర్‌ ప్లేలో ఓపెనర్ల జోరుతో పటిష్ట స్థితిలో నిలిచిన బెంగళూరు ఒక్కసారిగా తడబడింది. 92 పరుగుల వద్ద తొలి వికెట్‌ పడినా.. స్టార్‌ ఆటగాళ్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. జోష్‌ లిటిల్‌(4/45) ఓకే ఓవర్లో విల్‌ జాక్స్‌(1), మ్యాక్స్‌వెల్‌(4)లను వెనక్కి పంపాడు. కామెరూన్‌ గ్రీన్‌(1) సింపుల్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. లిట్టిల్‌ 4ఓవర్లు బౌలింగ్‌ చేసి 45 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ మహ్మద్‌ సిరాజ్‌కు లభించింది.
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ ఆదిలోనే కష్టాల్లో పడింది. సిరాజ్‌ వరుస ఓవర్లలో ఓపెనర్లు వృద్ధిమాన్‌ సాహా(1) శుభ్‌మన్‌ గిల్‌(2)లను పెవిలియన్‌కు పంపాడు. మరోవైపు ఫామ్‌లో ఉన్న సాయి సుదర్శన్‌(6) గ్రీన్‌ ఔట్‌ చేయడంతో గుజరాత్‌ కోలుకోలేకపోయింది. స్టార్‌ బ్యాటర్‌ డేవిడ్‌ మిల్లర్‌(30)కి తోడు షారుక్‌ ఖాన్‌(27)లు గుజరాత్‌ను ఆదుకునేలా కనిపించినా.. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని కరణ్‌ శర్మ విడదీశాడు. షారుఖ్‌ సింగిల్‌ తీయబోగా.. కోహ్లీ నేరుగా వికెట్లను గురి చూసి కొట్టడంతో షారుక్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఆ సమయానికి గుజరాత్‌ జట్టు 5వికెట్లు కోల్పోయి 88పరుగులే చేసింది. ఈ క్రమంలో తెవాటియా, రషీద్‌లు బ్యాట్‌ ఝుళిపించి జట్టు స్కోర్‌ 100 పరుగులకు దాటించారు. విజరు ఓవర్లో రషీద్‌ భారీ సిక్సర్‌, కరన్‌ శర్మ వేసిన 16వ ఓవర్లో తెవాటియా వరుసగా 4, 6, 4, 4 బాది 19 పరుగులు పిండుకున్నాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 29బంతుల్లోనే 44 పరుగులు జోడించారు. దయాల్‌ బౌలింగ్‌లో రషీద్‌ బౌల్డ్‌ అయ్యాక వచ్చిన ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌ విజరు శంకర్‌(10) ఓ బౌండరీతో మాత్రమే మెరిసాడు. దీంతో గుజరాత్‌ టైటాన్స్‌కు బెంగళూరు బౌలర్లు కళ్లెం వేశారు. ఒక దశలో 150కు పరుగులు కొట్టేలా కనిపించిన గుజరాత్‌ చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయింది. 148పరుగులకు ఆలౌటైంది. బెంగళూరు బౌలర్లు సిరాజ్‌, యశ్‌ దయాల్‌, వి.వ్యాషక్‌లకు రెండేసి, గ్రీన్‌, కరణ్‌ శర్మలకు ఒక్కో వికెట్‌ దక్కాయి.

18బంతుల్లో డుప్లెసిస్‌ అర్ధసెంచరీ..
ఛేదనలో భాగంగా బెంగళూరు కెప్టెన్‌ డుప్లెసిస్‌ కేవలం 18బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తిచేశాడు. దీంతో ఐపిఎల్‌లో బెంగళూరు తరఫున వేగంగా అర్ధసెంచరీని కొట్టి బ్యాటర్ల జాబితాలో డుప్లెసిస్‌ రెండోస్థానంలో నిలిచాడు. క్రిస్‌ గేల్‌(17బంతుల్లో) రికార్డును డుప్లెసిస్‌ బ్రేక్‌ చేయడంలో విఫలమయ్యాడు. రాబిన్‌ ఊతప్ప, రజత్‌ పటీధర్‌ 19బంతుల్లో అర్ధసెంచరీని కొట్టి ఆ డుప్లెసిస్‌ తర్వాత స్థానంలో ఉన్నారు.

స్కోర్‌బోర్డు(సంక్షిప్తంగా)…
గుజరాత్‌ : 147/ఆలౌట్‌(19.3ఓవర్లలో)
(షారుక్‌ ఖాన్‌ 37, డేవిడ్‌ మిల్లర్‌ 30; వి.వ్యాషక్‌ 2/23, సిరాజ్‌ 2/29, దయాల్‌ 2/21)
బెంగళూరు : 152/6(13.4ఓవర్లలో) (డుప్లెసిస్‌ 64, కోహ్లి 42; లిట్టిల్‌ 4/45)

➡️