దేశవాళీ క్రికెట్‌ ఆడాల్సిందే: బిసిసిఐ

Feb 14,2024 11:51 #Cricket, #Sports

ముంబయి: జాతీయ జట్టు తరఫున ఆడాలంటే ఇప్పటినుంచి ప్రతి ఒక్క ఆటగాడు దేశవాళీ క్రికెట్‌ ఆడాల్సిందేనని బిసిసిఐ హెచ్చరించింది. గాయాల బారిన ఆటగాళ్లు, బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో ఉన్న వారు మినహా.. మిగిలిన వారంతా రంజీల్లో పాల్గనాలని పిలుపునిచ్చింది. జాతీయ జట్టుకు సెలక్ట్‌ కానివారు ఫిట్‌గా ఉంటే.. రంజీల్లో తమ రాష్ట్రాల జట్లకు ఆడాలి. ఫిట్‌నెస్‌కు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే జాతీయ క్రికెట్‌ అకాడమీని సంప్రదించాలి. రాబోయే కొన్ని రోజుల్లో ఈ నిబంధనను బిసిసిఐ ఆటగాళ్లకు చెప్పనుంది. కేవలం ఎన్‌సీఏ మినహాయింపు ఇచ్చిన ప్లేయర్లు మాత్రమే రంజీల్లో ఆడకుండా ఉండే అవకాశం ఉంది. కొందరు జనవరి నుంచి వచ్చే ఐపిఎల్‌ సీజన్‌ కోసం ప్రాక్టీస్‌ చేస్తున్నవారిని ఉద్దేశించే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది” అని బిసిసిఐ అధికారిక వర్గాలు తెలిపాయి. ఇషాన్‌ కిషన్‌ ఎపిసోడ్‌ నేపథ్యంలో బిసిసిఐ సీరియస్‌గా ఉందని తెలుస్తుంది. గత కొద్దికాలంగా జాతీయ జట్టులో లేని ఇషాన్‌ కిషన్‌.. దేశవాళి టీమ్‌కు అందుబాటులో ఉండకుండా ఐపీఎల్‌ 2024 సన్నాహకాల్లో బిజీగా ఉన్నాడు. బరోడాలో ఏర్పాటు చేసిన ట్రైనింగ్‌ క్యాంప్‌లో ఇషాన్‌.. హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యాలతో కలిసి ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్‌ ఆడాలని కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ చేసిన సూచనలను సైతం ఇషాన్‌ లెక్క చేయకుండా ఐపిఎల్‌ కోసం ప్రిపేర్‌ అవుతున్నాడు. ఇషాన్‌ చర్యల పట్ల బోర్డు చాలా సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం.

➡️