పంజాబ్‌ భల్లే.. భల్లే..

Apr 4,2024 23:47 #2024 ipl, #Cricket, #Punjab Kings, #Sports
  • ఉత్కంఠ పోరులో గుజరాత్‌పై గెలుపు
  •  ఈ సీజన్‌లో తొలిసారి భారీ లక్ష్యాన్ని ఛేదించిన కింగ్స్‌

అహ్మదాబాద్‌: పంజాబ్‌ కింగ్స్‌ జట్టు ఈ సీజన్‌లో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. నరేంద్ర మోడీ స్టేడియంలో చివరిబంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌పై 3వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌ జట్టు విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 199పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేయగా.. ఛేదనలో పంజాబ్‌ జట్టు 19.5ఓవర్ల లో 7వికెట్లు నష్టపోయి 200పరుగులు చేసి విజయం సాధించింది. పంజాబ్‌ గెలుపులో శశాంక్‌ సింగ్‌(61నాటౌట్‌), ఇంపాక్ట్‌ ప్లేయర్‌ అషుతోష్‌ శర్మ(31) కీలకపాత్ర పోషించారు. అంతకుముందు గుజరాత్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌తోపాటు చివర్లో రాహుల్‌ తెవాటియా బ్యాట్‌ ఝుళిపించడంతో గుజరాత్‌ జెయింట్స్‌ జట్టు 199పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. శుభ్‌మన్‌(89నాటౌట్‌), సాయి సుదర్శన్‌(33), చివర్లో తెవాటియా(23నాటౌట్‌) బ్యాటింగ్‌లో రాణించారు. టాస్‌ ఓడిన గుజరాత్‌కు ఆదిలోనే పంబాబ్‌ కింగ్స్‌ పేసర్‌ రబడ షాకిచ్చాడు. డేంజరస్‌ వద్ధిమాన్‌ సాహా(11)ను ఔట్‌ చేశాడు. బౌండరీతో జోరుమీదున్న సాహా బౌండరీ వద్ద ధావన్‌ చేతికి చిక్కాడు. ఆతర్వాత వచ్చిన కేన్‌ విలియమ్సన్‌(26), సాయి సుదర్శన్‌(33)లు ధాటిగా ఆడారు. వీళ్లిద్దరూ ఔటైనా గిల్‌ తన ట్రేడ్‌మార్క్‌ షాట్లతో స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. హర్షల్‌ పటేల్‌, రబడ ఓవర్లో భారీ సిక్సర్లు బాదాడు. విధ్వసంక ఆటగాడు డేవిడ్‌ మిల్లర్‌ లేనందున భుజాన వేసుకున్నాడు. చివరిదాకా నిలబడి జట్టుకు కొండంత స్కోర్‌ అందించాడు. చివర్లో రాహుల్‌ తెవాటియా(23 నాటౌట్‌) దంచాడు. పంజాబ్‌ బౌలర్లలో రబడ రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో భాగంగా పంజాబ్‌ కెప్టెన్‌ ధావన్‌(1), బెయిర్‌స్టో(22) నిరాశపరిచినా.. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌(35) రాణించాడు. సామ్‌ కర్రన్‌(5), సికిందర్‌ రాజా(15), జితేశ్‌ శర్మ(16) కూడా పెద్దగా రాణించలేకపోయారు. అయినా చివరి బంతి వరకు క్రీజ్‌లో నిలిచి శశాంక్‌ మ్యాచ్‌ను ముగించాడు. గుజరాత్‌ బౌలర్లు నూర్‌ అహ్మద్‌కు రెండు, అజ్మతుల్లా, ఉమేశ్‌, రషీద్‌ ఖాన్‌, మోహిత్‌ శర్మ, దర్శన్‌ సింగ్‌లకు ఒక్కో వికెట్‌ దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ శశాంక్‌ సింగ్‌కు లభించింది.

➡️