ఓపెనర్లుగా రోహిత్‌, కోహ్లి ఆడాలి – సౌరవ్‌ గంగూలీ

Apr 23,2024 22:43 #Sports

కోల్‌కతా: టి20 ప్రపంచకప్‌-2024కు టీమిండియా ఓపెనింగ్‌ జోడి గురించి బిసిసిఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌ శర్మతో కలిసి విరాట్‌ కోహ్లి ఇన్నింగ్స్‌ ఆరంభిస్తే బాగుంటుందని, యశస్వి జైస్వాల్‌ కూడా రేసులో ఉన్నాడనే విషయం కూడా మర్చిపోద్దని పేర్కొన్నాడు. టి20 ప్రపంచకప్‌కు జట్టు ఎంపికకు ఐపిఎల్‌-2024 ప్రదర్శన కీలకం కానుందన్నాడు. ముంబయి ఇండియన్స్‌ తరఫున రోహిత్‌ శర్మ, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరఫున విరాట్‌ కోహ్లి ఇన్నింగ్స్‌ ఆరంభిస్తున్న ప్రస్తుత తరుణంలో వీరి ప్రదర్శన ఆధారంగా వీరిని ఎంపిక చేయాలని గంగూలీ కోరాడు. ఈ సీజన్‌ ఐపిఎల్‌లో కోహ్లి ఎనిమిది మ్యాచుల్లో 379 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో ఇప్పటికే ఓ సెంచరీ(113నాటౌట్‌) కూడా ఉంది. మరోవైపు.. రోహిత్‌ శర్మ కూడా శతకంతో చెలరేగాడు. ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి అతడు 303 పరుగులు చేశాడు. ఇక రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ ఆరంభంలో తడబడ్డా ముంబయి ఇండియన్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో అజేయ సెంచరీ(104)తో రేసులోకి వచ్చాడు. కాగా మే 26న ఐపిఎల్‌-2024 ముగియనుండగా.. జూన్‌ 2నుంచి అమెరికా- వెస్టిండీస్‌ వేదికగా టి20 ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభం కానుంది. జూన్‌ 5న టీమిండియా తమ తొలి లీగ్‌ మ్యాచ్‌ను ఐర్లాండ్‌తో తలపడనుంది.
వికెట్‌ కీపర్‌గా పంత్‌ బెస్ట్‌: రికీ పాంటింగ్‌
టి20 ప్రపంచకప్‌కు ఈనెలాఖరులోపు ప్రకటించాల్సి ఉన్న ప్రస్తుత తరుణంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. భారత జట్టు వికెట్‌ కీపర్‌గా రిషబ్‌ పంత్‌ను ఎంపికచేయడం ఉత్తమమని పేర్కొన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథి, బ్యాటర్‌గా పంత్‌ అద్భుతంగా వర్కట్‌ చేస్తున్నాడని, గాయాలనుంచి పూర్తి కోలుకున్నాడని అన్నాడు. 27న టి20 ప్రపంచకప్‌కు టీమిండియా జట్టును బిసిసిఐ ప్రకటిస్తుందన్న విషయం తెలిసిందే.

➡️