‘ఆడుదాం ఆంధ్రా ‘పూర్తి స్థాయిలో సన్నద్ధతకండి

Dec 20,2023 20:52

పార్వతీపురం  :ఈ నెల 26నుంచి ప్రారంభం కానున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలకు పూర్తిస్థాయిలో సన్నద్ధతతో ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుండి ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీల నిర్వహణపై జిల్లా కలెక్టర్‌ తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26 నుంచి ఫిబ్రవరి 10వరకు 47 రోజుల పాటు ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు జరగనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో ఇమిడివున్న ప్రతిభను వెలికి తీయడానికి ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మట్టిలోని మాణిక్యాలను గుర్తించి తగిన ప్రోత్సాహం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. విద్యతోపాటు శారీరక, మానసిక దఢత్వానికి క్రీడలు దోహదపడతాయని తెలిపారు. గ్రామ సచివాలయం, మండల, నియోజక వర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రికెట్‌, వాలీ బాల్‌, కబడ్డీ, టెన్ని క్యాయిట్‌, ఖోఖో, వంటి ఐదు విభాగాల్లో క్రీడా పోటీలను సందడిగా నిర్వహించాలన్నారు. గ్రామస్థాయి నుండి అవసరమైన మైదానాలు పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇప్పటికే క్రీడా కిట్లను ఆయా గ్రామ సచివాలయాలకు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. జిల్లా స్థాయిలో 3కె మారథాన్‌ నిర్వహించాలన్నారు. ఇప్పటి వరకు 1.3 కోట్ల వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయని, 34.19 లక్షల క్రీడాకారులు పోటీలో పాల్గొంటున్నారని తెలిపారు. ప్రజా ప్రతినిదులు, అధికారులు క్రీడా పోటీల నిర్వహణను పర్యవేక్షించాలని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా క్రీడా పోటీల్లో నిర్వహిస్తున్నామని గ్రామస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపేలా క్రీడాకారులను ప్రోత్సహించాలని అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అర్‌.గోవింద రావు, ఐటిడిఎ పిఒ సి.విష్ణుచరణ్‌, డ్వామా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కె.రామచంద్రరావు, డిఇఒ ఎన్‌.ప్రేమ్‌ కుమార్‌, డిఎస్‌డిఒ ఎస్‌.వెంకటేశ్వర రావు, జిల్లా ఇమ్మ్యునైజేషన్‌ అధికారి డా, జగన్మోహన్‌ రావు, డిపిఒ బలివాడ సత్యనారాయణ, జిల్లా రవాణా శాఖ అధికారి సి. మల్లిఖార్జున రెడ్డి, వివిధ విభాగాల శిక్షకులు, తదితరులు పాల్గొన్నారు.

➡️