గిరిజనులు జల దీక్ష

జల దీక్ష నిర్వహిస్తున్న గిరిజనులు

 

ప్రజాశక్తి -అనంతగిరి:తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని, నిలిచిన రోడ్డు పనులు వెంటనే పున: ప్రారంభించాలని గిరిజనులు వినూత్న రీతిలో జల దీక్ష చేపట్టారు. మండలంలోని గుమ్మ పంచాయతీ పరిధి కరీగొడా, కడరేవు గ్రామాలకు చెందిన గిరిజనులు ఆదివారం వినూత్న రీతిలో డోలీా సహాయంతో జల దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం ఉమ్మడి జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు మాట్లాడుతూ, గుమ్మ పంచాయతీ నిమ్మ ఊట గ్రామం, కర్రి గోడ, కడరేవు, పిన్నకోట పంచాయతీ పరిధి కొట్టంగుడా, గొప్పులపాలెంలో సుమారు 160 కుటుంబాలు జీవనం సాగిస్తున్నామన్నారు. 2021 ,22 సంవత్సరంలో రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం కోటీ 20 లక్షల నిదుల మంజూరు చేయగా అధికారులు రోడ్డు పనులు మొదలుపెట్టి కిలోమీటర్‌ వరకూ చేపట్టి అసంపూర్తిగా వదిలివేసారని విమర్శించారు. గిరిజనులు రోగాల బారిన పడినప్పుడు వైద్యం కోసం ఆసుపత్రులకు డోలీల్లో తరలిస్తున్నారని సకాలంలో వైద్య సేవలు అందక గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు మృత్యువాతకు గురవుతున్నారని తెలిపారు.తక్షణమే రోడ్డు పనులను పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే డోలీ మోతలతో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రాప రాజారావు, నందోలి రాజారావు, ఉల్లి సింహాచలం పాల్గొన్నారు.

➡️