గుచ్చుకుంటున్న రాళ్లు.. సర్దుకుంటున్న నేతలు..! ‘

గుచ్చుకుంటున్న రాళ్లు.. సర్దుకుంటున్న నేతలు..! ‘

ఇవి అసలు రోడ్లేనా.. అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాం’ మొర్రో అని జనం ఎంత గొంతు చించుకున్నా పట్టని నేతలకు ఎన్నికల వేళ ఆ రాళ్లే గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. దీంతో అధికార వైసిపి ప్రజాప్రతినిధులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ రానుండడంతో హడావుడీగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు గ్రామాలకు వెళ్తున్న ఎంఎల్‌ఎలకు ఆయా ప్రాంతాల ప్రజల నుంచి ఊహించని విధంగా రోడ్ల అంశంపై ప్రతిఘటన ఎదురుకావడంతో ఏం చేయాలా అని తలలు పట్టుకుంటున్న పరిస్థితి. పథకాల గురించి ఎన్ని చెబుతున్నా ‘అవన్నీ చేశారు మంచిదే.. కానీ మా ఊరి రోడ్డు సంగతి ఏంటీ’ అంటూ నిలదీస్తుండడంతో నేతలకు నోటిమాట రావడం లేదు. ‘ఈసారి గెలవగానే రోడ్డు వేసేద్దాంలే’ అని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంటే గ్రామస్తులే కాకుండా వైసిపి నేతలు సైతం సమేమిరా అంటున్నారు. ‘రోడ్డు వేస్తేనే ఓట్లు అడిగేది.. లేదంటే లేదు’ అని తెగేసి చెబుతుండటంతో ఎంఎల్‌ఎలు కంగుతింటున్నారు. దీంతో హడావుడీగా తమ మాట వినే కాంట్రాక్టర్లచే టెండర్లు వేయించి కొద్దిపాటి పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ప్రస్తుతం ముమ్మరంగా రోడ్ల నిర్మాణ పనులు సాగుతున్నాయి. దీనికి ప్రధాన కారణంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు ప్రజల నుంచి అసంతృప్తి సెగలు తగలడమేనని స్పష్టంగా చెప్పొచ్చు. పోలవరం నియోజకవర్గంలో 15, 20 సంవత్సరాలుగా నిర్మాణం చేపట్టని రోడ్లను సైతం ఇప్పుడు హడావుడీగా పనులు చేస్తుండటమే దీనికి నిదర్శనం. ఏదేమైనా ఎన్నికల వేళ అధికార వైసిపికి అన్ని తరగతుల ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురవుతుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. అంగన్వాడీలు, ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు, మున్సిపల్‌ కార్మికులు సమ్మె చేపట్టి నిర్దిష్ట డిమాండ్లు కొన్ని సాధించుకున్నారు. ఇక ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆర్థిక బకాయిలు, ఐఆర్‌ కోసం వివిధ రూపాల్లో ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. ఫలితంగా కొన్ని బకాయిలు ప్రభుత్వం చెల్లించడం ప్రారంభించింది. ఇవన్నీ చూసిన జనం పోరాడితే గాని తమ సమస్యలు పరిష్కరించదనే అంశాన్ని గుర్తించి తమ గ్రామాలకు వస్తున్న ప్రజాప్రతినిధులకు తమ డిమాండ్లు విన్పిస్తున్నారు. సంక్షేమ పథకాలే ఊపిరిగా భావించిన అధికార పార్టీకి ప్రస్తుత పరిస్థితులు మింగుడు పడటం లేదు. దీంతో హడావుడీగా కొన్ని సమస్యలైనా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో ‘పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప’ అన్న మహాకవి శ్రీశ్రీ స్థాయిలో కాకపోయినా పోరాడితే సమస్యలు ఎంతోకొంత పరిష్కారమవుతాయని జనం చర్చించుకోవడం విశేషం. ఇక జీలుగుమిల్లిలోని గిరిజన సంక్షేమ బాలుర వసతిగృహంలో విద్యార్థులు అస్వస్థతకు గురికావడం తీవ్ర కలకలం సృష్టించింది. గిరిజన సంక్షేమ శాఖ, విద్యాశాఖ స్పందన ఎలాగున్నా వైద్యఆరోగ్య శాఖ స్పందించిన తీరు విద్యార్థుల ప్రాణాలను కాపాడిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. బుట్టాయగూడెం మండలం పులిరామన్నగూడెంలోని వసతి గృహంలో విద్యార్థి హత్యకు గురైనప్పుడు అధికారులు హడావుడీ చేశారు. విద్యార్థి హత్య ఘటన పక్కన పెడితే వసతిగృహాల్లో నెలకొన్న సమస్యలన్నీ బహిరంగమయ్యాయి. తినడానికి ప్లేట్లు సైతం లేవని తేలడం అందరినీ విస్మయపర్చింది. జీలుగుమిల్లి ఘటనలోనూ అవే పరిస్థితులు ప్రత్యక్షమవ్వడం బాధాకరం. గదుల్లో ఫ్యాన్లు అధ్వానంగా ఉండటం, వంట గది అపరిశుభ్రంగా ఉండటంపై జాయింట్‌ కలెక్టర్‌, ఎస్‌టి కమిషన్‌ సభ్యుడు తదితరులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆహార పదార్థాలకు అవసరమైన సరుకులు సరఫరా చేసే పంపిణీదారుడుపై, మెస్‌ కాంట్రాక్టర్‌పైగానీ ఎవరూ నోరు మెదపకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అయితే ఘటన జరిగి ఐదు రోజుల తర్వాత ఆ వసతిగృహానికి వెళ్లిన డిఎంహెచ్‌ఒ అక్కడి పరిస్థితులు చూసి నిర్ఘాంతపోయారంటే అధికారుల నిర్లక్ష్యం ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఘటన అనంతరం అధికారుల రాకతోనైనా వార్డెన్‌, ప్రిన్సిపల్‌, ఎటిడబ్ల్యూఒ తదితరులు వసతిగృహాంలో మెరుగైన వసతులు కల్పించలేకపోయినా కనీసం పరిశుభ్రంగా ఉంచడం ఏమంత కష్టం కాదు. అయితే దానికి భిన్నంగా ఇప్పటికీ వసతిగృహాంలో పరిస్థితులు మెరుగుపడకపోగా నానబెట్టిన మినపప్పు దుర్వాసన వస్తుండటంతో డిఎంహెచ్‌ఒ ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి రావడానికి ఐటిడిఎ, గిరిజన సంక్షేమాధికారుల ఉదాశీనతే కారణమని చెప్పొచ్చు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి హాస్టళ్లలో పరిస్థితులపై అధ్యయనం చేసి సౌకర్యాల మెరుగుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని జీలుగుమిల్లి ఘటన చెప్పకనే చెబుతోంది.- విఎస్‌ఎస్‌వి.ప్రసాద్‌

➡️