చదువుల పొదరిల్లు

Jan 17,2024 21:47

ప్రజాశక్తి-సీతంపేట  :  సీతంపేట ఐటిడిఎ పరిధిలో ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు.. ఇలా ఎన్ని ఉన్నా… ఐటిడిఎకు కూతవేటు దూరంలో ఉన్న హడ్డుబంగి గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలకు ప్రత్యేకత గుర్తింపు ఉంది. ఏ అధికారి, ప్రజాప్రతినిధి వచ్చినా ఆ పాఠశాలను చూపించడానికి అధికారులు తీసుకొస్తారు. ఎందుకంటే ఆ పాఠశాలలో విద్యా బోధన, మెనూ అమలు, ఆహ్లాదకర వాతావరణంపై ప్రధానోపాధ్యాయులు బి.ఉమావాణి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. దీంతో ప్రతి ఏటా పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ప్రవేశానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. సీతంపేట మండలం నుంచే కాకుండా ఇతర మండలాల నుంచి కూడా విద్యార్థులు చేరేందుకు వస్తున్నారు.మండలంలో సీతంపేట ఐటిడిఎకు కూతవేటు దూరంలో ఉంది హడ్డుబంగి గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల. రోడ్డు పక్కనుంచి ప్రయాణిస్తుంటే పూల మొక్కలతో కార్పొరేట్‌ తరహాలో దర్శనమిస్తుంది. ఈ పాఠశాలలో మూడో తరగతి నుండి పదో తరగతి వరకు 598 మంది విద్యార్థినులు విద్యను అభ్యశిస్తున్నారు. గతేడాది 99 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షకు హాజరుకాగా, శతశాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది పదో తరగతిలో 94 మంది విద్యార్థులను మార్చిలో పబ్లిక్‌ పరీక్షలు రాయడానికి సిద్ధం చేశారు.ఫోకస్‌ స్టూడెంట్‌ఈ పాఠశాలలో పదో తరగతిలో 94 మంది విద్యార్థులుంటే, వారిని 11 గ్రూపులుగా.. ఎ-ప్లస్‌, ఎ, బి-ప్లస్‌, బి, సి గ్రేడ్లుగా విద్యార్థులను విభజించారు. 11 గ్రూపుల్లో ఎ-ప్లస్‌ విద్యార్థి, సి గ్రేడ్‌ విద్యార్థి ప్రతి గ్రూపులో ఉంటారు. అందులో సబ్జెక్టు పరంగా సందేహం ఉన్న విద్యార్థికి తెలివైన విద్యార్థి నివృత్తి చేస్తారు. విద్యార్థుల వద్ద ఆ సందేహం నివృత్తి కాకుంటే, ఆ సబ్జెక్టు టీచర్‌ పరిష్కరిస్తారు. సులభ పద్ధతుల్లో బోధించడం, కొన్ని మెళకువలు చెప్పడం వంటివి చేస్తున్నారు.ప్రోత్సాహక తరగతులుపాఠశాలలో వెనకబడిన విద్యార్థినులకు ప్రోత్సాహక తరగతులు పేరిట ఇక్కడ ప్రత్యేక ఫోకస్‌ చేస్తున్నారు. సాయంత్రం 5.30 నుంచి 7:30 వరకు రోజుకు ఇద్దరు టీచర్లు చొప్పున ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం 4.30 నుంచి 7.30 గంటల వరకు విద్యార్థినులను వారిలో వారే చదివిస్తారు. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు డిజిటల్‌ విద్యను అందిస్తున్నారు.ఆహ్లాదకర వాతావరణంఈ పాఠశాలలో విశాలమైన స్థలం ఉండటంతో మనబడి నాడు-నేడు కార్యక్రమంలో సిసి రహదారి నిర్మించారు. కార్పొరేట్‌ తరహాలో భవనాలు కనిపిస్తాయి. పాఠశాల ఆవరణమంతా పూలమొక్కలు దర్శనమిస్తాయి. అంతేకాకుండా వంగ, టమోట, దుంపలు, మిర్చి, కంది పంటలు వేశారు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్‌ పార్కు కూడా తయారు చేశారు. విద్యార్థుల ఆరోగ్యంపై హెచ్‌ఎం ప్రత్యేక దృష్టిసారించారు. ఎఎన్‌ఎం పాఠశాలలో ఉంటూ విద్యార్థినులను తనిఖీ చేస్తూ, ఎప్పటికప్పుడు వైద్య శిబిరాలు నిర్వహిస్తారు.క్రీడల్లో ముందంజఇక్కడ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో సైన్స్‌ ప్రాజెక్టులు చేయడంలో ముందంజలో నిలుస్తున్నారు. గుంటూరులో గతేడాది అక్టోబర్‌లో జరిగిన ఖేలో ఇండియాలో అండర్‌-14, 17లో రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపికయ్యారు. అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌కు ఈ పాఠశాల ఎంపిక కావడంతో రూ.12 లక్షలు మంజూరైంది. దీన్ని అప్పటి పిఒ నవ్య ప్రారంభించారు. పిఎం స్కూల్‌ ఫర్‌ రేసింగ్‌ ఇండియాలో కూడా ఈ పాఠశాల ఎంపిక చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మెనూ పక్కాగా అమలు చేస్తున్నారు.

100 శాతం ఉత్తీర్ణతకు కృషి

ఇప్పటికే ఐటిడిఎ పిఒ, డిడి ఆదేశాల మేరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. స్టడీక్లాసులు నిర్వహిస్తున్నాం. ఎప్పటికప్పుడు దత్తత అధికారి ఎంపిడిఒ తనిఖీలు చేపడుతున్నారు. ఎంకరేజ్మెంట్‌ తరగతులు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాం. ఉన్నతాధికారుల సూచనలు, సలహా మేరకు ప్రణాళికలు తయారుచేశాం. ప్రతిరోజూ తెల్లవారు జామున విద్యార్థులను చదివిస్తున్నాం. ఈ ఏడాది కూడా పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి అన్ని ప్రణాళికలు రూపొందించాం.- బి.ఉమావాణి, ప్రధానోపాధ్యాయులు,గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల, హడ్డుబంగి

➡️