నిరాసితులను గోదారిలో ముంచిన ప్రభుత్వం

రంపచోడవరంలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి కిరణ్‌

ప్రజాశక్తి-రంపచోడవరం పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారంగాని పునరావాసం గాని కల్పించకుండా వారిని వైసిపి ప్రభుత్వం నడి గోదారిలో ముంచిందని సిపిఎం ఎఎస్‌ఆర్‌ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌ అన్నారు. జిఒ 3కు చట్టబద్ధత కల్పించాలని, ఏజెన్సీ స్పెషల్‌ డిఎస్‌సి ప్రకటించాలని కోరుతూ ఈనెల 10న జరుగుతున్న రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్‌కు మద్దతుగా సిపిఎం ఆధ్వర్యాన శనివారం స్థానిక ఐటీడీఏ ముందు ఆదివాసీ జనరక్షణ దీక్ష జరిగింది. ఇందులో పాల్గొన్న కిరణ్‌ మాట్లాడుతూ బంద్‌కు మద్దతుగా విజయవాడలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆధ్వర్యాన దీక్షలు చేపట్టినట్లు చెప్పారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లోతా రామారావు మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో సుమారు 1025 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉండగా కేవలం 515 పోస్టులను డీఎస్సీలో ప్రకటించారని, అందులో గిరిజనులకు కేవలం 37 పోస్టులు మాత్రమే కేటాయించారని తెలిపారు. అటవీ భూహక్కుల చట్టం అని ప్రవేశపెట్టి ఇక్కడ భూములను బడా బాబులకు కట్టబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు పెయ్యాల పాపారావు, రాంబాబు, పాండవుల సత్యనారాయణ, పొత్తురు సత్యనారాయణ, వి.సత్యనారాయణ, బి.సింహద్రి, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.చింతూరు : ఏజెన్సీ ఉద్యోగాల్లో ఆదివాసీలకు 100శాతం రిజర్వేషన్‌ కల్పించే జీవో 3కు చట్టబద్ధత కల్పించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు వల్లపు వెంకట్‌ డిమాండ్‌ చేశారు. శనివారం సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆదివాసీ జనరక్షణ దీక్ష చింతూరు ఐటిడిఎ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్‌ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు. మండల కార్యదర్శి సీసం సురేష్‌ మాట్లాడుతూ పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసిలు వేక రాజ్‌ కుమార్‌, పూనం ప్రదీప్‌కుమార్‌, సర్పంచ్‌ సవలం మారయ్య, సిపిఎం నాయకులు పోడియం లక్ష్మణ్‌, కారం సుబ్బారావు, పల్లపు పెద్ద రాములు, సుమన్‌, రాములమ్మ, సోడా వెంకటలక్ష్మి, పెడగయ్య, రాఘవయ్య, పోడియం నరేష్‌, కారం సుందర్‌ పాల్గొన్నారు.

➡️