భగత్‌ సింగ్‌ ఆశయాలను నెరవేరుద్దాం

అరకులోయలో నివాళి అర్పిస్తున్న సిపిఎం నేతలు

ప్రజాశక్తి- అరకులోయ:మండల కేంద్రంలోని ఆదివాసీ గిరిజన సంఘం భవనంలో సిపిఎం అరకు మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం భగత్‌ సింగ్‌ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. అనంతరం సిపిఎం మండల కార్యదర్శి కిండంగి రామారావు, పొద్దు బాలదేవ్‌ మాట్లాడుతూ, బ్రిటిష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, భారతదేశ స్వాతంత్రం కోసం భగత్‌సింగ్‌ ప్రాణాలను త్యాగం చేశారని కొనియాడారు. యువత ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరారు.బ్రిటిష్‌ పాలన నుండి భారతదేశం విముక్తి పొందాలని 23 ఏళ్ల వయసులోనే చిరునవ్వుతో ఉరి కంభం ఎక్కి తన ప్రాణాలు త్యాగం చేశారని కొనియాడారు. ప్రస్తుతం దేశంలో మతాల మధ్య చిచ్చుపెట్టి విచ్చిన్నం చేసే పనిలో నేడు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర పన్నుతున్నాయని విమర్శించారు. కార్మికులు, కష్టజీవుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని కూల్చడానికి స్వతంత్ర పోరాటంలో అగ్రభాగాన ఉండి పోరాటాలు చేశారన్నారు. దేశంలో ఆర్థిక, సామాజిక స్వాతంత్రం కావాలని భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుఖదేవ్‌ కలలుకన్నారని తెలిపారు.బ్రిటిష్‌ ప్రభుత్వం ఆనాడు దోచుకోవడానికి ప్రయత్నం చేసిందని, నేడు బిజెపి ప్రభుత్వం బడా పెట్టుబడిదారులకు ప్రభుత్వ రంగ సంస్థలు, అటవీ సంపదను అప్పజెప్పేందుకు ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. బిజెపికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాంగి రామన్న, కిల్లో జగనాదం, కె.గోపాల్‌, పాంగి బాలకృష్ణ, తదితరులు ఉన్నారు. డుంబ్రిగుడ:స్థానిక యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఎంపీపీ పాఠశాలలో భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుఖదేవ్‌ వర్థంతి ఘనంగా నిర్వహించారు. యూటీఎఫ్‌ ఆవిర్భావ ఉద్యమ నేత, సంఘ సేవకుడు వెంకటస్వామి వర్ధంతి శనివారం ఘనంగా నిర్వహించారు. యూటీఎఫ్‌ నాయకులు ఆయా నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వి మహేశ్వరరావు మాట్లాడుతూ, భగత్‌ సింగ్‌ సేవలు మరువలేమన్నారు. వారి త్యాగాలను దేశంలో ప్రతిఒక్కరూ స్మరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కమిటీ సభ్యులు కన్నయ్య, శ్రీరాములు, మండల అధ్యక్ష, కార్యదర్శులు రాజారావు, బాలక్రిష్ణ, నాయకులు దుక్కు, శ్యాంసుందర్‌, మేఘనాధ్‌ తదితరులు పాల్గొన్నారు.. పాడేరు:భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుఖదేవ్‌ లను యువత ఆదర్శంగా తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ కె.రాజశేఖర్‌ పిలుపునిచ్చారు. ఏఐఎస్‌ఎఫ్‌ ఆద్వర్యంలో పాడేరు మండల సమితి శనివారం పాడేరులో భగత్‌ సింగ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్థానిక కార్యాలయంలో భగత్‌ సింగ్‌ 93వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ కె.రాజశేఖర్‌, మండల కార్యదర్శి కృష్ణ,మండల నాయకులు పి.మత్స్యరాజు, జి.రమేష్‌, పి.రాజుబాబు, నాయుడు, అనిల్‌, దేవదాసు, కె.మల్లేష్‌, ఈశ్వర్‌ పాల్గొన్నారు.

➡️