మల్లికా స్పెయిన్‌కు జాతీయ, రాష్ట్ర అవార్డులు

అవార్డు అందుకుంటున్న డాక్టర్‌ నరేష్‌

ప్రజాశక్తి-గుంటూరు : ప్రముఖ సీనియర్‌ స్పెయిన్‌ సర్జన్‌, మల్లిక స్పెయిన్‌ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జె.నరేష్‌ బాబును అసోసియేషన్‌ ఆఫ్‌ స్పెయిన్‌ సర్జన్స్‌ ఆఫ్‌ ఇండియా నేషనల్‌ బెస్ట్‌ రీసెర్చ్‌ అవార్డుతో సత్కరించింది. అలాగే సర్వైకల్‌ స్పాండిలైటిస్‌పై మల్లిక స్పెయిన్‌ చేసిన అసాధారణ పరిశోధన కోసం ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్థోపెడిక్‌ సర్జన్స్‌ సొసైటీ ద్వారా ప్రతిష్టాత్మక వ్యాగ్రేశ్వర్డుడు బంగారు పతకాన్ని కూడా పొందింది. డాక్టర్‌ నరేష్‌ సంచలనాత్మక అధ్యయనం ప్రకారం మెడలో స్పాండిలైటిస్‌ లక్షణాలు ఉన్నప్పటికీ ఎంఆర్‌ఐలో ఎటువంటి లోపాలు లేని 50 మంది రోగులపై దృష్టి సారించింది. వీరందరికీ పడుకొని తీసుకున్న ఎంఆర్‌ఐతోపాటు కూర్చొని ఉన్నప్పుడు, మెడ ముందుకు, వెనకకు వంచినప్పుడు ఎంఆర్‌ఐ పరీక్ష నిర్వహించారు. ఈ విధానం ద్వారా రోగి తల బరువు, కూర్చున్నప్పుడు కలిగే రోజువారీ కదలికల ప్రభావం మెడలోని నరాలపై ఏ మేరకు అదనపు ఒత్తిడిని కలిగిస్తుందో పరిశీలిం చారు. అనూహ్యంగా వారందరిలో కూర్చుని ఎంఆర్‌ఐ స్కాన్‌ చేసినప్పుడు నరాలపై తీవ్రమైన ఒత్తిడి కలగటం గుర్తించారు. ఈ విషయాలను ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ పరిశోధనలో కొనుగొన టం విశేషం. గత నెలలో ముంబైలో జరిగిన అసోసియేషన్‌ ఆఫ్‌ స్పెయిన్‌ సర్జన్స్‌ ఆఫ్‌ ఇండియా(ఎఎస్‌ఎస్‌ఐ) వార్షిక సదస్సులో ఈ పరిశోధనా పత్రానికి డాక్టర్‌ నరేష్‌కు ఎఎస్‌ఎస్‌ఐ బెస్ట్‌ రీసెర్చ్‌ అవార్డు అందజేసింది. అంతే కాకుండా తిరుపతిలో జరిగిన అర్థోపెడిక్‌ సర్జన్‌ సొసైటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఓఎస్‌ఎస్‌ఎపి) వార్షిక సమావే శంలో ఈ అధ్యయనాన్ని ప్రదర్శించారు. ఇందుకు 2024కు ఉత్తమ పేపర్‌ ప్రజంటేష న్‌గా వ్యాగ్రేశ్వరుడు పతకాన్ని గెలుచుకుంది. ఈ పరిశోధనలో మల్లికా స్పెయిన్‌ సెంటర్‌కు చెందిన డాక్టర్‌ పృధ్వీ కుమార్‌రెడ్డి, డాక్టర్‌ గజేంద్ర, డాక్టర్‌ ప్రజ్వల్‌ పాల్గొన్నారు. రోగి పడుకొని ఉన్నప్పుడు ఎటువంటి నొప్పి రాదని, కూర్చోవటం, నిలబ డటం, నడవటం మాత్రమే వారికి నొప్పిగా ఉంటుందని, మల్లికా స్పెయిన్‌ సెంటర్‌లో అందుబాటులోకి వచ్చిన డైనమిక్‌ ఎంఆర్‌ఐ ద్వారా నిలబడి, కూర్చొని, వంగి, కదలికలలో కూడా ఎంఆర్‌ఐ నిర్వహించే సౌలభ్యం ఉందని డాక్టర్‌ నరేష్‌ వెల్లడించారు.

➡️