రైతు ఉద్యమంపై మోడీ ప్రభుత్వ దాడిని ఖండించండి

Feb 23,2024 23:16
రైతు ఉద్యమం

యువరైతు మృతికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత
కేంద్ర కార్మిక సంఘాల నాయకుల
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి
రైతు ఉద్యమంపై మోడీ ప్రభుత్వ దాడిని ఖండించాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు పిలుపు మేరకు నగరంలోని శ్యామల సెంటర్‌లో సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు, ఎపి రైతు సంఘం, ప్రజాసంఘాలు, సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్‌ పార్టీల ఆధ్వర్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పోరాటంపై మోదీ ప్రభుత్వం దమనకాండకు నిరసనగా ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, ఎఐటియుసి జిల్లా కన్వీనర్‌ కె.రాంబాబు, ఐఎఫ్‌టియు జిల్లా నాయకులు చీకట్ల వెంకటేశ్వరరావు, సిపిఐ నగర కార్యదర్శి కొండలరావు, సిపిఐ ఎంఎల్‌ నగర కార్యదర్శి కిరణ్‌ మాట్లాడారు. రైతు ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వ దాడిని ఖండించాలన్నారు. యువరైతు మృతికి మోడీ ప్రభుత్వానిదే బాధ్యతన్నారు. 56 అంగుళాలు ఛాతి వున్నది రైతులపై యుద్ధం చేయడానికా అని ప్రశ్నించారు. రైతాంగాన్ని కార్పొరేట్లకు బానిసలుగా చేసే బిజెపిని ఒడించాలని కార్మిక సంఘాలు, వామపక్ష, ప్రజా సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్‌, మతోన్మాద విధానాలు రైతుల పాలిట ఉరితాడులుగా మారి 3 లక్షలమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. దేశంలోని రైతుల వద్ద ఉన్న భూములను కార్పొరేట్లకు అప్పనంగా అప్పగించేందుకు మూడు వ్యవసాయ చట్టాలకు సవరణ చేసి మోడీ తనకున్న కార్పొరేట్‌ అభిమానాన్ని చాటుకున్నారన్నారు. ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది పాటు పోరాడి 700 మంది రైతులు పైబడి ప్రాణ త్యాగాలు చేశారన్నారు. రైతులు ప్రాణ త్యాగాలు ఫలితంగానే ఆ చట్టాలకు చేసిన సవరణలు మోడీ రద్దు చేశారన్నారు. మొదటి దశ రైతు ఉద్యమం సందర్భంగా మోడీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కారణంగా రెండో దఫా రైతు ఉద్యమం ప్రారంభమైందన్నారు. పంటలకు కనీసం మద్దతు ధర, విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు రద్దు చేయాలని, స్వామినాధన్‌ కమీషన్‌ రిపోర్టు అమలుచేయాలని, భారత వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుండి కాపాడాలని ఢిల్లీ సరిహద్దుల్లో శాంతియుతంగా రైతులు పోరాడుతన్నారన్నారు. మోదీ ప్రభుత్వం రైతులపై శత్రుదేశంపై దాడి చేసినట్లుగా రైతులపై పెళ్లెట్‌ గన్స్‌, పిరంగులు, తుపాకులు, బాష్పవావు ప్రయోగం, రోడ్లపై కంచెలు వేసి తీవ్ర నిర్భందాలకు గురిచేస్తున్నారన్నారు. 90 శాతం వ్యవసాయ భూముల్లో కౌలు రైతులు అర్ధ బానిసలుగా పనిచేస్తున్నారన్నారు. ప్రభుత్వాలు ప్రకటించే రైతు పథకాలు ఏవీ కౌలు రైతులకు చేరట్లేదని విమర్శించారు. యువ రైతు మతిపై న్యాయ విచారణ జరిపించాలని, రైతులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షులు ఎం.సుందరబాబు, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్‌ఎస్‌.మూర్తి, బి.పవన్‌, టిఎస్‌.ప్రకాష్‌, నాయకులు టి.సావిత్రి, పేరయ్యలింగం, అప్పల నర్సయ్య, ఆనంద్‌, ఎన్‌.రాజా, రాంబాబు, వెంకటేశ్వరరావు, కె.రామకృష్ణ, ఎఐటియుసి నాయకులు సస్పా రమణ, నల్లా రామారావు, పడిడిఎస్‌యు జిల్లా కోశాధికారి కె.భానుప్రసాద్‌, జిల్లా నాయకులు ధర్నేష్‌, దినేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️