వామ్మో.. ఎలుగు

వజ్రపుకొత్తూరు మండలం చీపురుపల్లి పంచాయతీ అనకాపల్లిలో

పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆందోళన చేస్తున్న మృతుల బంధువులు

తరచూ దాడులతో ప్రాణాలను బలిగొంటున్న వైనం

శనివారం దాడిలో ఇద్దరు మృతి, మహిళ పరిస్థితి విషమం

భయాందోళనలో ఉద్దాన ప్రాంతం

రక్షణ చర్యలు చేపట్టని ప్రభుత్వంఉద్దానం ప్రాంతంలో రెండేళ్లుగా వజ్రపుకొత్తూరు, పలాస, మందస మండలాలోల తరచూ ఎలుగులు దాడులు చేస్తున్నాయి. ఎలుగు దాడుల్లో ప్రాణాలను బలికొంటున్నాయి. మరికొందరు గాయాల పాలవుతున్నారు. తాజాగా శనివారం వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లిలో ఎలుగు దాడిలో ఇద్దరు మృతి చెందగా, మహిళ తీవ్రంగా గాయపడింది. ఎప్పుడు ఏ ప్రాంతంలో ఎలుగు దాడి చేస్తుందనే భయం వారిని నిరంతరం వెంటాడుతోంది. జీడి తోటలే ఆధారంగా జీవనోపాధి పొందుతున్న రైతులు, కూలీలు పనుల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. వెలుగు దాడులు నిత్యకృత్యమవుతున్నా ప్రభుత్వం నుంచి రక్షణ చర్యలు కనిపించడం లేదు. అటవీశాఖ అధికారులు అవగాహన కల్పించడానికే పరిమితమవుతున్నారు.

ప్రజాశక్తి- వజ్రపుకొత్తూరు, పలాస

వజ్రపుకొత్తూరు మండలం చీపురుపల్లి పంచాయతీ అనకాపల్లిలో శనివారం ఉదయం జరిగిన ఎలుగు దాడిలో అదే గ్రామానికి చెందిన చీడిపల్లి లోకానాథం (48), ట్రాక్టర్‌ డ్రైవర్‌ అప్పికొండ కూర్మారావు (47) అక్కడక్కడే మృతి చెందగా… లోకనాథం భార్య సావిత్రి తీవ్ర గాయాలు పాలైంది. ఘటనా పై కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా న్నాయి. వజ్రపుకొత్తూరు మండలం చీపురుపల్లి పంచాయతీ అనకాపల్లి గ్రామ సమీపంలో చీడపల్లి లోకనాథం, ఆయన భార్య సావిత్రి తన జీడి తోటలో శుభ్రం చేస్తున్నారు. సమీపంలో ఉన్న కొండ ప్రాంతం నుంచి అకస్మాత్తుగా ఎలుగు జీడి తోటలో చొరబడి ముందుగా లోకనాథంపై దాడి చేసింది. దీన్ని గమనించిన భార్య సావిత్రి సమీపంలో ఉన్న జీడి రైతు, ట్రాక్టర్‌ డ్రైవర్‌ అప్పికొండ కూర్మారావుకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించింది. దీంతో కూర్మారావుతో పాటు మరో నలుగురు రైతులు ట్రాక్టర్‌పై ఘటనా స్థలానికి చేరుకున్న తరుణంలో సావిత్రిని విడిచి పెట్టి కూర్మారావుపై అతిక్రూరంగా దాడి చేసి పొట్టన పెట్టుకుంది. దీనిని చూసిన గ్రామస్తులు ట్రాక్టర్‌పై దూకేసి స్వగ్రామానికి పారిపోయారు. కొద్ది సేపటి తరువాత సావిత్రిని 108లో పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం జిల్లా సర్వజనాస్పత్రికి రిఫర్‌ చేశారు. మృతుడు కూర్మారావు పంచాయతీలో వార్డు మెంబరుగా పనిచేస్తున్నారు. ఈయనకు భార్య కృష్ణవేణి, కుమారై విజయలక్ష్మి, కుమారుడు శ్రీకాంత్‌ ఉన్నారు. అలాగే లోకనాథంకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉండగా మధ్యాహ్నం దాడి చేసిన ఎలుగుని గ్రామస్తులతో కర్రలతో దాడి చేసి హతమార్చారు. అనంతరం ఎలుగు ఘటనాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వజ్రపుకొత్తూరు ఎస్‌ఐ రామారావు తెలిపారు. మంత్రి పరామర్శఎలుగు దాడిలో మృతి చెందిన లోకనాథం, కూర్మారావు మృతదేహాలన్టు పశుసంవర్థకశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు పరిశీలించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి క్షతగాత్రరాలు సావిత్రి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. బాధితులకు అండగా ఉంటామని, ప్రభుత్వం తరుపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంరెండేళ్లుగా ఉద్దాన ప్రాంతంలో తరచూ ఎలుగుల సంచరిస్తున్నా అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లే జీడి రైతులు రైతులు, కూలీలు మృతి చెందుతున్నారని ఉద్దాన ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎలుగు దారులు జరగకుండా నివారించాలని పదేపదే ఏడాదిగా అటవీశాఖ అధికారులు కోరుతున్నా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వేసవి సమీపిస్తున్న తరుణంలో కొండ ప్రాంతాల్లో తాగునీరు లేక జీడి పళ్లు తినేందుకు ఎలుగులు జీడి తోటల్లోకి వచ్చేస్తున్నాయని జీడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలుగుల నియంత్రణకు చర్యలుఎలుగు జీడి తోటల్లో సంచరిస్తున్నాయని, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే పలుమార్లు రైతులకు అవగాహన కల్పించామన్నారు. ఎప్పటికప్పుడు ఉద్దాన ప్రాంతంలో తమ సిబ్బంది పర్యటిస్తున్నారు. ఎవరికైనా ఎలుగులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. కవిపుచర్యలకు పాల్పడద్దని చెప్పాం. గతంలో ఎలుగు దాడిలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాం. – మురళీకృష్ణ, అటవీ శాఖ రేంజర్‌, కాశీబుగ్గ

గతంలో…

రెండేళ్లుగా ఎలుగు బంటి దాడులు అధికమయ్యాయి. ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందగా, పలువురు తీవ్రగాయాల పాలయ్యారు. 2022 జూన్‌ 19న వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగికి చెందిన కడమటి కోదండరావు జీడి తోటలో పనులు చేస్తుండగా ఎలుగు దాడిలో మృతి చెందారు. ఆ మరోసటి రోజు వజ్రపుకొత్తూరులో కలిసిశెట్టి అప్పలస్వామి, సిహెచ్‌.చలపతి, ఉప్పరపల్లి పురుషోత్తం, ఉప్పరపల్లి తారకేశ్వరరావు, సంతోష్‌, తామడ షణ్ముఖరావులపై దాడి చేసింది. తామడ షణ్ముఖరావు, సిహెచ్‌.చలపతిరావు మృతి చెందారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న చీపురుపల్లి పంచాయతీ ఎం.గూడూరుకు చెందిన మత్స్యకారుడు పి.కుమారస్వామి, డెప్పురుకు చెందిన లైసెట్టి నారాయణమ్మ, సీలం తాతారావు, ఊర్మిళపై దాడి చేసింది. ఒంకులూరుకు చెందిన నర్తు సింహాద్రి, గుంటు పోలమ్మ, పసుపు రడ్డి సింహాచలం, చిన్న వంకులూరుకు చెందిన డొక్కరి అప్పలస్వామి, సంతోష్‌ నగర్‌కు చెందిన గుంటి తుంబనాథం, సొండుపల్లి హేమసుందర్‌, శ్రీరామ్‌నగర్‌కు చెందిన లింగాల మహాలక్ష్మిపై దాడులు జరిగాయి. మృతదేహాలతో నిరసన

రెండేళ్లుగా ఉద్దాన ప్రాంతంలో ఎలుగు బంటి దాడిలో జీడి రైతులు, వ్యవసాయ కూలీలు మృతి చెందుతున్నా పాలకులు, అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఉద్దాన ప్రాంత ప్రజలు, మృతుల కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. మృతదేహాలను ఘటనా స్థలం నుంచి అంబులెన్స్‌లో పలాస ప్రభత్వాస్పత్రికి తీసుకొస్తున్నారు. ఈ తరుణంలో వాహనాన్ని కాశీబుగ్గ బస్టాండ్‌ ఆవరణలో నిలిపివేసి మృతదేహాలతో ధర్నా చేపట్టారు. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఉద్దాన ప్రాంతంలో జీడి రైతులు, వ్యవసాయ కూలీలు ఎలుగు దాడిలో మృతి చెందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. అనంతరం పోలీసులను చుట్టిముట్టారు. చివరకు కాశీబుగ్గ, వజ్రపుకొత్తూరు ఎస్‌ఐలు పారినాయుడు, రామారావులు మృతుల కుటుంబ సభ్యులకు సద్ది చెప్పడంతో ధర్నాను విరమించారు. అనంతరం మృతదేహాలను పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీంతో గొడవ సద్దుమణిగింది.

పలుమార్లు ఫిర్యాదు చేశా

ఉద్దానంలో ఎలుగు దాడుల్లో మృతులు ముమ్మాటికీ అటవీశాఖ హత్యలే. ఉద్దానంలో ఎలుగు సంచారంపై అటవీశాఖకు చాలాసార్లు ఫిర్యాదు చేశాం. అటవీశాఖ అధికారులు స్పందించలేదు. అనకాపల్లికి చెందిన ఇద్దరు మృతి చెందడం అటవీశాఖ బాధ్యత వహించాలి. ఒకవైపు ఉద్దానంలో కిడ్నీ వ్యాధులు మరణ మృదంగం మోగిస్తుంటే… మరోవైపు ఎలుగు ప్రాణాలు తీస్తున్నాయని ఆందోళన కలిగింది. జీడి పంట చేతికి వచ్చే సమయంలో రైతులు జీడి తోటలకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఎలుగులను అదుపు చేయడంలో అటవీశాఖ నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుంది. మరిన్ని దాడులు జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా చూడాలి.

– కొండప్ప సురేఖ, మెట్టూరు ఎంపిటిసి

మృతుల కుటుంబాలను ఆదుకోవాలివజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లిలో జరిగిన ఎలుగు దాడిలో మృతి చెందిన కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలి. కొంత కాలంగా పలాస, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలోని ఉద్దాన ప్రాంతంలో ఎలుగు విపరీతంగా సంచరిస్తూ మనుషుల ప్రాణాలను తీసుకున్నాయి. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఉద్దాన ప్రాంతంలో ఎలుగు దాడులు జరుగుతున్నాయి. ఎలుగు బారినపడి మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి.

– ఎం.వినోద్‌కుమార్‌, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గురుదాసుపురం

 

➡️