సిఎం స్పందించకుంటే.. ఉరే గతి..!

Jan 3,2024 09:15

పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు

         పుట్టపర్తి రూరల్‌ : ఇచ్చిన వాగ్దానం మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎస్‌ఎస్‌ఎ కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్‌ చేయకపోతే తమకు ఉరేగతి అని ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు నిరసన తెలిపారు. అపరిష్కృత సమస్యల పరిష్కారం కోరుతూ సమగ్ర శిక్షా అభియాన్‌ కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయం చేపట్టిన సమ్మె మంగళవారం 14వ రోజుకు చేరుకున్నాయి. ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు మెడలో ఉరితాళ్లు వేసుకుని సామూహిక ప్రభుత్వానికి నిరసన తెలిపారు. తమను రెగ్యులరైజ్‌ చేయాలని, లేకపోతే చావేగతి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా సమస్యలు అయినా తీర్చండి లేదా మమ్మల్ని ఒకేసారి ఉరి తియ్యండి ‘ అని నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించే దాకా సమ్మె విరమించబోమని వారు తెగేసి చెప్పారు. బుధవారం నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తామేమి ప్రభుత్వాన్ని గొంతెమ్మ కోర్కెలు కోరలేదని, ఉద్యోగ భద్రత, కనీస వేతనం, హెచ్‌ఆర్‌ పాలసీ మాత్రమే అడుగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా అధ్యక్షులు ఓబిరెడ్డి, రామన్న, నాగరాజు, ఓబులేసు, రూపాదేవి, శ్రీలత, హేమావతి, అనిత, శ్రీనివాసులు, ఆనంద్‌, ప్రసాద్‌ రాజశేఖర్‌, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

➡️