మనువాద శక్తులపై ఐక్య పోరు

Dec 4,2023 09:06 #Delhi, #Dharna
  • దళిత, వ్యవసాయ కార్మిక సంఘాల పార్లమెంటు మార్చ్‌లో వక్తల పిలుపు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కొత్త భవిష్యత్తు నిర్మాణం కోసం 2024 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని దళిత హక్కుల సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది. దళితుల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం కోరుతూ సోమవారం నాడిక్కడ జంతర్‌ మంతర్‌ వద్ద వేలాదిమంది దళితులు, వ్యవసాయ కార్మికులు పార్లమెంట్‌ మార్చ్‌ నిర్వహించారు. దేశ నలుమూలల నుండి వేలాది మంది కార్యకర్తలు ప్లకార్డులు చేబూని రాజధానిలో కదం తొక్కారు. సిపిఎం ఎంపిలు జాన్‌ బ్రిట్టాస్‌, శివదాసన్‌, సిపిఐ ఎంపిలు ఎం సెల్వరాజు, బినరు విశ్వం, ఆర్‌జెడి ఎంపి మనోజ్‌ కుమార్‌ ఝా సంఘీభావం తెలిపారు. సంయుక్త కిసాన్‌ మోర్చా నుంచి హన్నన్‌ మొల్లా, ఎఐకెఎస్‌ నుంచి కృష్ణప్రసాద్‌, సెంట్రల్‌ ట్రేడ్‌ యూనియన్ల ఉమ్మడి వేదిక నుంచి సుకుమార్‌ ధామ్లే మద్దతు ప్రకటించారు. దళిత హక్కుల కోసం పనిచేస్తున్న సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు మద్దతు తెలిపారు. డిఎస్‌ఎంఎం ప్రధాన కార్యదర్శి రామచంద్ర డోమ్‌, ఎఐఎడబ్ల్యుయు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విజయరాఘవన్‌, బి వెంకట్‌, సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు సుభాషిణీ అలీ, జిఎస్‌ గోరియా, విఎస్‌ నిర్మల్‌, పాల్‌ దివాకర్‌, శ్రీరామ్‌ చౌదరి, రాహుల్‌, అధియమాన్‌, బీనా పల్లికల్‌, సూర్యకాంత్‌ పాశ్వాన్‌, అభిరమ్య, దేవి రాణి, కురబి వినరు కుమార్‌ మాట్లాడారు. కేంద్రంలోను, బిజెపి పాలిత రాష్ట్రాల్లోను దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారని,ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. దళిత మహిళలు, బాలికలపై దాడులకు కారకులైనవారిని కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు ముగింపు పలకాలని డిమాండ్‌ చేశారు. ‘బిజెపిని ఓడించాలి, భవిష్యత్‌ను నిర్మించాలి’ అన్న నినాదాలతో ప్రదర్శన హోరెత్తింది. ఈ కార్యక్రమంలో కె సోమప్రసాద్‌, మల్లేపల్లి లక్ష్మయ్య, ధీరేంద్ర ఝా, కర్నెల్‌ సింగ్‌, ఎన్‌ సాయిబాలాజీ, విక్రమ్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

  • రాష్ట్రపతికి 11 డిమాండ్లతో వినతి

రాష్ట్రపతికి 11 డిమాండ్లతో కూడిన లక్షలాది సంతకాలతోకూడిన విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. గ్రామీణ, పట్టణ ఉమ్మడి ఆస్తి వనరుల కేటాయింపు, వినియోగంలో దళితులకు సమానమైన వాటా ఉండేలా చట్టాన్ని రూపొందించి, దానిని కఠినంగా అమలు చేయాలి., స్త్రీలు, పురుషుల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఆహారం, సురక్షితమైన తాగునీరు, దుస్తులు, ఇళ్లు, ప్రజారోగ్యం, వైద్య సంరక్షణ, సామాజిక భద్రత, సామాజిక సేవలు, అన్ని ప్రజా సౌకర్యాలు, స్థలాలకు యాక్సెస్‌తో తగిన జీవన ప్రమాణాల హక్కులను సమానంగా పరిరక్షించాలి. గ్రామీణ భూమిలేని వారికి జీవన వేతనం, ఐదెకరాల భూమి యాజమాన్యాన్ని నిర్ధారించాలి. ఎస్‌సిలకు కేటాయించిన భూమి మొత్తం వారు స్వాధీనం చేసుకునేలా చూడాలి. బాండెడ్‌ లేబర్‌ సిస్టమ్‌ (నిర్మూలన) చట్టం, 1976ని అమలు చేయాలి. బాల కార్మికులను వెంటనే రద్దు చేయాలి., అన్ని ప్రభుత్వ సేవలు, కాంట్రాక్టులలో ఎస్‌సిలకు దామాషా రిజర్వేషన్‌ ఉండేలా చూడాలి. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు తప్పనిసరిగా సప్లయర్‌ డైవర్సిటీ, డీలర్‌షిప్‌ డైవర్సిటీని అమలు చేయాలి., నూతన విద్యా విధానాన్ని ఉపసంహరించుకోవాలి. ఎస్‌సిలందరికీ ఉచిత, నాణ్యమైన విద్యను హామీ ఇవ్వాలి. తగిన స్కాలర్‌షిప్‌లను వెంటనే చెల్లించేలా చూడాలి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో రిజర్వేషన్‌ కోటాను అమలు చేయాలి. విద్యాసంస్థల్లో కులవివక్షకు వ్యతిరేకంగా చట్టం చేయాలి.ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్‌ తప్పనిసరి చేయాలి. ప్రభుత్వ రంగాల్లో ఉన్న బ్యాక్‌లాగ్‌ను వెంటనే భర్తీ చేసి పదోన్నతుల్లో రిజర్వేషన్లను పునరుద్ధరించాలి., మాన్యువల్‌ స్కావెంజింగ్‌, మాన్యువల్‌ శానిటరీ వర్క్‌ అనే అమానవీయ పద్ధతిని తొలగించాలి. పాటించని వారందరినీ ప్రాసిక్యూట్‌ చేసి శిక్షించాలి., ఉపాధి హామీ పథకాన్ని షరతులు, అడ్డంకులు లేకుండా తప్పనిసరిగా అమలు చేయాలి. పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి. పనిదినాలు 200కు పెంచాలి. రోజుకు రూ.600 వేతనం ఇవ్వాలి., ఎస్‌సి, ఎస్‌టి అట్రసిటీ చట్టాన్ని స్ఫూర్తితో అమలు చేయాలి. నేరస్తులను చట్టాల ప్రకారం కఠినంగా శిక్షించాలి. వారి విధులను విస్మరించినందుకు దోషులుగా తేలిన పరిపాలనా సభ్యులకు తప్పనిసరిగా శిక్ష విధించాలి. ఈ చట్టం కింద నేరస్తులు పోలీసు స్టేషన్‌లోనే బెయిల్‌ పొందేందుకు అనర్హులను చేయాలి. సత్వర న్యాయం జరిగేలా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలి., కేంద్ర బడ్జెట్‌ సబ్‌ ప్లాన్‌లో ఎస్‌సిలకు కేటాయించిన నిధులను వారి కోసం మాత్రమే వినియోగించాలి. రాష్ట్రాలకు కూడా ఇలాంటి చట్టాలు రూపొందించాలి. మొత్తం జనాభాలో ఎస్‌సి, ఎస్‌టిల నిష్పత్తి ప్రకారం బడ్జెట్‌ కేటాయింపులు జరగాలి. ఈ నిధులను మళ్లించడం, లేదా ఉపయోగించకపోవడంపై నేరంగా పరిగణించబడాలి. కులగణన చేపట్టాలి., సాధారణ జనాభా గణనతోపాటు కులగణన కూడా చేపట్టాలి.

➡️