అభ్యర్థుల ఖర్చులు పక్కాగా నమోదు

Apr 16,2024 22:46
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన

సమావేశంలో మాట్లాడుతున్న మనజీర్‌

  • జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం

నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన రోజు నుంచే అభ్యర్థుల ఖాతాలో ఖర్చు లెక్కించేందుకు సిద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆర్‌ఒలు, నోడల్‌ అధికారులతో సాధారణ ఎన్నికలకు నిర్వహణకు సంబంధించిన సన్నద్ధతపై మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థి నామినేషన్‌ వేసిన దగ్గర నుంచి అతని ఖాతాలో పక్కాగా ఖర్చు నమోదు చేయాలని చెప్పారు. సభలు, సమావేశాలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, జెండాలు, బ్యానర్లు, పోస్టర్లు, వినియోగిస్తున్న వాహనాలు, ఏజెంట్లకు పెట్టే భోజనాల ఖర్చు సైతం అభ్యర్థి ఖాతా కిందకే వస్తుందన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థులు ఇద్దరూ ఉమ్మడిగా సమావేశాలు, సభలు నిర్వహిస్తే ఆ ఖర్చును ఇద్దరికీ సర్దుబాటు చేయాలని సూచించారు. జిల్లాకు ముగ్గురు ఐఆర్‌ఎస్‌ అధికారులను వ్యయ పరిశీలకులుగా ఎన్నికల కమిషన్‌ నియమించిందని తెలిపారు. ఒకరు పార్లమెంటుకు, మిగిలిన ఇద్దరూ అసెంబ్లీ నియోజకవర్గాలకు వ్యయ పరిశీలకులుగా వ్యవహరిస్తారని చెప్పారు. సభలు, సమావేశాలు జరిగిన 24 గంట్లలోగానే అభ్యర్థి ఖాతాలో ఖర్చు నమోదు చేయాలని, ఆలస్యం చేయకూడదని స్పష్టం చేశారు. సమావేశాలకు అనుమతినిచ్చే విభాగం, ఎంసిఎంసి, ఎంసిసి, ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, వీడియో సర్వైలెన్స్‌ టీమ్స్‌, సంబంధిత ఇతర బృందాలతో సమన్వయం చేసుకొని ఖర్చులు నమోదు చేయాలని సూచించారు. 48 గంటలు దాటినా కొన్ని శాఖలు రోజువారీ ఎన్నికల నివేదికలు అందజేయడం లేదని, ఇకపై అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రతిపాదనలకు బుధవారమే ఆఖరి రోజు అని స్పష్టం చేశారు. నామినేషన్ల స్వీకరణ సమయం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమేనని, మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ చేయాలని, డిఎస్‌పి స్థాయి అధికారి బందోబస్తు నిర్వహించాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఎం నవీన్‌, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, ఆర్‌ఒలు నూరుల్‌ కమర్‌, భరత్‌నాయక్‌, సిహెచ్‌.రంగయ్య, లక్ష్మణమూర్తి, రామ్మోహన్‌, సుదర్శన్‌దొర, అప్పారావు, ఐసిడిఎస్‌ పీడీ బి.శాంతిశ్రీ, జిఎస్‌టి అసిస్టెంట్‌ కమిషనర్‌ రాణీమోహన్‌, సిపిఒ ప్రసన్నలక్ష్మి, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ సూర్యకిరణ్‌, జిల్లా ఆడిట్‌ అధికారి సుల్తానా, డిటిసి చంద్రశేఖర్‌ రెడ్డి, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె.చెన్నకేశవరావు, డిపిఒ వెంకటేశ్వర్లు, డిఆర్‌డిఎ పీడీ కిరణ్‌ కుమార్‌, గ్రామ, వార్డు సచివాలయాల నోడల్‌ అధికారి వాసుదేవరావు, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ సూర్యకిరణ్‌, చల్లా ఓబులేసు, గడ్డెమ్మ తదితరులు పాల్గొన్నారు. జిలానీ సమూన్‌

➡️