ఐటి ఉద్యోగాల పేరుతో ఎర !

Mar 31,2024 10:24 #IT jobs
  • సైబర్‌ నేరాల్లో ఇరుక్కున్న 250మందిని కాపాడిన భారత్‌ ఎంబసీ

న్యూఢిల్లీ : తప్పుడు ఆన్‌లైన్‌ రిక్రూట్‌మెంట్‌ కుంభ కోణాల్లో, సైబర్‌ నేరాల్లో ఇరుక్కున్న దాదాపు 250మంది భారతీయులను కంబోడియా నుండి కాపాడినట్లు విదేశాంగ శాఖ శనివారం వెల్లడించింది. గత మూడు మాసాల్లో 75 మందికి పైగా భారత్‌కు తిరిగివచ్చారు. సంబంధిత ఏజెంట్లపై దర్యాప్తు సంస్థలు దేశవ్యాప్తంగా దర్యాప్తు చేపట్టాయి. పలు కంపెనీలు ఐటి సెక్టార్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామనే హామీలతో దక్షిణాసియా, తూర్పు ఆసియా వ్యాప్తంగా అభ్యర్ధులను రిక్రూట్‌ చేసుకుంటాయి. ఇవి కంబోడియా, లావోస్‌, మయన్మార్‌ల్లో పనిచేస్తున్నాయి. ఐటి ఉద్యోగాల పేరుతో విదేశాలకు వెళ్లిన తర్వాత వారిని సైబర్‌ అవినీతి సెంటర్లలో బలవంతంగా పనిచేసేలా ఒత్తిడి తీసుకొస్తారు. టెలిఫోన్‌, ఆన్‌లైన్‌ల్లో ఇతరులను మోసగించేలా వీరిపై ఒత్తిళ్లు, వేధింపులు తీసుకువస్తారు. ఉపాధి అవకాశాల పేరుతో ఆకర్షించి మోసపోయిన భారతీయుల నుండి ఫిర్యాదులు అందిన తర్వాత కంబోడియాలోని ఇండియన్‌ ఎంబసీ వెంటనే స్పందించిందని, ఈ అవినీతి, బూటకపు విధానాలు, పథకాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేందుకు కంబోడియా అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది.

➡️