ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో ఈ ఐదేళ్ల కాలంతో తన అస్మదీయులకు చెల్లించేందుకు రూ.10 లక్షల కోట్లు అప్పు చేసిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.30 వేల కోట్ల బకాయిలను ఎందుకు చెల్లించలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రశ్నించారు. తక్షణమే ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలన్నింటినీ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్థిక సంవత్సరం ముగింపురోజు మార్చి 31న రిజర్వు బ్యాంకు నుంచి రూ.వెయ్యి కోట్ల అప్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆర్థిక సంవత్సరానికి కూడా అప్పులతో స్వాగతం పలుకుతూ ఈ నెల 2న సెక్యూరిటీల వేలం ద్వారా రూ.4 వేల కోట్లు అప్పు తెచ్చిందన్నారు. తెచ్చిన అప్పులను కేవలం తమ అస్మదీయుల బిల్లులకు మాత్రమే ఖర్చు చేస్తోందని విమర్శించారు. ఎన్నికల కోడ్‌ వచ్చాక కూడా రూ.14,500 కోట్లను తమ వారికి చెల్లించారని, వీటిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

➡️