దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని అడ్డుకోండి : ఇసిని కోరిన ‘ఇండియా’ ఫోరం

Mar 25,2024 08:43 #EC, #India, #investigative agencies
  • బెదిరింపులు, వేధింపులతో స్వేచ్ఛాయుత ఎన్నికలు అసాధ్యం
  • ప్రతిపక్షాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకే కేజ్రీవాల్‌ అరెస్ట్‌

న్యూఢిల్లీ : ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నారని ప్రతిపక్ష ‘ఇండియా’ ఫోరం ఆరోపించింది. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. సిపిఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి, కాంగ్రెస్‌ ఎంపీలు కెసి వేణుగోపాల్‌, అభిషేక్‌ సింఘ్వి, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు డెరెక్‌ ఓ బ్రెయిన్‌, నదిముల్‌ హక్‌, ఆప్‌ ఎంపీ సందీప్‌ పాఠక్‌, డిఎంకె నేత పి విల్సన్‌ తదితరులు ఎన్నికల కమిషన్‌తో సమావేశమై ఈ మేరకు ఓ మెమొరాండం అందజేశారు.

ఎన్నికల వేళ.. దాడులు, విచారణలు, అరెస్టులు జరిగినప్పుడు ముందుగా వాటిని ఎన్నికల కమిషన్‌ పరిశీలించాలని, ఆ తర్వాత అందుకు ఆమోదం తెలపాలని ఆ మెమొరాండంలో ‘ఇండియా’ ఫోరం నేతలు సూచించారు. ఇసి అనుమతి తీసుకున్న తర్వాతే చర్యలకు ఉపక్రమించాలని తెలిపారు. దీనికి సంబంధించి ఒక సర్క్యులర్‌ విడుదల చేయాలని కోరారు. ప్రతిపక్ష నేతలను వేధించడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడే అధికారులు, వ్యక్తులపై విచారణ ప్రారంభించడం సహా వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ‘బెదిరింపులు, వేధింపుల వాతావరణంలో స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదన్నది మా అభిప్రాయం. అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయకుండా ఎన్నికల కమిషన్‌ తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. అందరికీ సమానావకాశాలు కల్పించకపోతే ఎన్నికల ప్రక్రియ తన పవిత్రతను కోల్పోతుంది’ అని మెమొరాండంలో తెలిపారు. ఒక సిట్టింగ్‌ ముఖ్యమంత్రిని అరెస్ట్‌ చేయడం రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుందని ‘ఇండియా’ ఫోరం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. తన ఎన్నికల లక్ష్యాలను నెరవేర్చుకునే క్రమంలో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని అధికార పక్షం భావిస్తోందని, దానిలో భాగంగానే ఈ సంకేతాన్ని పంపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.’ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. అయినప్పటికీ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. అందరికీ సమానావకాశాలు లభించని పక్షంలో ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంటుంది’ అని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. పలు ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు ఇసి కలిశారని కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ సింఘ్వి చెప్పారు. ‘ఇది ఏ ఒక్క వ్యక్తికో లేదా పార్టీకో సంబంధించింది కాదు. ఇది రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి సంబంధించిన విషయం. ఎన్నికల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. దానిని దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం చేయడాన్ని అనుమతించకూడదు. అది స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడంపై ప్రభావం చూపుతుంది. అందుకే జోక్యం చేసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను కోరాం. 75 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఓ ముఖ్యమంత్రి అరెస్ట్‌ కావడం ఇదే మొదటిసారి’ అని ఆయన చెప్పారు.

అధికార దుర్వినియోగానికి పాల్పడేందుకు పాలక పక్షం ప్రయత్నిస్తోందని స్పష్టమవుతోందని, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ఇతర రాజకీయ పార్టీల అవకాశాలను దెబ్బతీయడమే దాని ఉద్దేశమని ‘ఇండియా’ ఫోరం పక్షాలు విమర్శించాయి. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలు, ఐపిసి నిబంధనలు ఉల్లంఘనకు గురవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాయి.

➡️