ఐఎఎస్‌ గుర్జార్‌పై హైకోర్టు ఆగ్రహం

Apr 24,2024 23:29 #AP High Court

ప్రజాశక్తి-అమరావతి :రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శి (ఇప్పుడు కేంద్ర సర్వీస్‌లో ఉన్నారు) ఎన్‌ గుల్జార్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయ వ్యవస్థ పట్ల కనీస గౌరవం లేకుండా ఉన్నారని ఆగ్రహించింది. కోర్టు ఉత్తర్వులను కావాలని ఉల్లంఘించారని తప్పుపట్టింది. కోర్టు తీసుకునే ధిక్కార చర్యలకు గుల్జార్‌ అర్హులని అభిప్రాయపడింది. ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత కోల్పోయారని, ఉద్యోగం నుంచి తొలగించాలని ఎందుకు ఆదేశించకూడదో చెప్పాలని పేర్కొంది. ఎందుకు ప్రాసిక్యూట్‌ చేయకూడదో వివరించాలని ఆయనను ఆదేశించింది. షోకాజ్‌ నోటీసులకు రెండు వారాల్లో జవాబు చెప్పాలని పేర్కొంది. గుల్జార్‌పై సుమోటోగా కోర్టు ధిక్కార కేసు నమోదు చేయాలని హైకోర్టు రిజిస్ట్రీకి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. బసవ శ్రీనివాస్‌ అనే వ్యక్తికి కారుణ్య నియామకం చేసేందుకు గుల్జార్‌ నిరాకరిస్తూ ప్రొసీడింగ్‌ ఇస్తే వాటిని హైకోర్టు రద్దు చేసింది. రెండేళ్ల నాటి శ్రీనివాస్‌ పిటిషన్‌పై తగిన నిర్ణయం తీసుకోవాలని తీర్పు చెప్పారు.
సరస్వతీదేవి వాణిజ్య పన్నులశాఖలో పనిచేస్తూ మరణించారు. ఆమె భర్త పెన్షన్‌ పొందుతున్నందున వారి కుమారుడు శ్రీనివాస్‌ కారుణ్య నియామకానికి అర్హులు కాదని అధికారులు తేల్చారు. దీంతో శ్రీనివాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దరఖాస్తుపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలన్న కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని శ్రీనివాస్‌ కోర్టు ధిక్కార పిటిషన్‌ వేశారు. ఈ కేసులో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో హైకోర్టు, గుల్జార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణను మే ఒకటికి వాయిదా వేసింది.

➡️