ఇప్పుడే చూశాడు అసలు శత్రువుని !

Feb 19,2024 11:10

రైతు ఇప్పటివరకూ

తనపై యుద్ధం చేసే వాళ్ళనే చూశాడు

ఇప్పడే చేయించే వాడిని కనిపెట్టాడు

 

మొలకెత్తే విత్తులో

కల్తీల కన్నీళ్ళలో

సత్తువనిచ్చే ఎరువులో

కడకు పురుగుల చంపలేని

మందుల కొనుగోళ్ళలో

మోసకారి వ్యాపారినే శత్రువుగా చూశాడు

ఇప్పుడే .. ఇప్పుడే చూశాడు

వాడికి ప్రాణం పోసిన పాలకుడిని !

 

ఆరుగాలం కష్టం

మడిలో పంట తడిలో

కలుపు పెరికేతలో

కోసిన పంట ఊడ్పులో

కరిగి ఇంకిన చెమట ధర

కార్పొరేటోడు కైంకర్యం చేస్తే

వాడే తన హంతకుడనుకున్నాడు

ఇప్పుడే .. ఇప్పుడే చూశాడు

వాడికి ప్రాణం పోసిన పాలకుడిని !

 

అందుకే .. అందుకేనేమో

దుకాణాలు మార్కెట్లపై పోరే చాలదని

వాళ్ళకు ప్రాణం పోసే

పాలకుడి మీదికే కదం తొక్కాడు

పార్లమెంటు చట్టాలతోనే తలపడ్డాడు

 

నిన్నటిదాకా దేశ రక్షకులంటే

జై కిసాన్‌, జై జవానన్న పాలకులు

ఇప్పుడు ముసుగు తీసేశారు

జై కార్పొరేట్‌, జై జవాన్‌ రూపాన్ని

దేశం ముందు ఆవిష్కరించారు

కిసాన్‌ మీదకు జవాన్ను తోలిన

కసాయి రూపం ప్రదర్శించారు

ప్రజల కంటే ముందు అక్షరంలేని

రైతు కూడా శత్రు జాడ చూశాడు

శత్రువులెవరో ప్రజలే చూడాలిక !

 

అందుకే రైతు ఇనుప మేకులు తొక్కేస్తూ

పెల్లెట్ల గాయాలు తట్టుకుంటూ

నీటి ఫిరంగు తరంగాలు దాటి

కేంద్రంపైనే యుద్ధం ప్రకటించాడు

ఇప్పుడు అక్షరం నేర్చిన సకల జనాలే

రైతుతో కలిసి బతుకు పోరు చేస్తారో

కార్పొరేట్‌ కింద నలిగి చస్తారో

తెలుసుకోవాలి .. తేల్చుకోవాలి !

– ఉన్నం వెంకటేశ్వర్లు

➡️