పక్షపాతం చూపిన ఇసి, పోలీస్‌ : మాజీ మంత్రి పేర్ని నాని

May 26,2024 20:58 #coments, #leaders, #perni nani, #TDP

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎలక్షన్‌ కమిషన్‌, పోలీస్‌శాఖ టిడిపికి అనుకూలంగా వ్యవహరించాయని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికల హింస జరగడానికి ఎన్నికల కమిషన్‌, పోలీసులే కారణమని ఆరోపించారు. కారంపూడి ఘటనలో టిడిపి కార్యకర్తలు మారణాయుధాలతో దాడులకు వస్తున్నారని సమాచారం వున్నా, గొడవలను నివారించకుండా పోలీసులు అక్కడ నుండి వెళ్లిపోవడం ఏమిటని ప్రశ్నించారు. కారంపూడిలో వైసిపి నేతల ఇళ్లు, వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నా.. పోలీసులు నిరోధించలేకపోయారన్నారు. పోలింగ్‌ తర్వాత కూడా టిడిపి అరాచకాలకు తెగబడిందని విమర్శించారు. రాష్ట్రంలో పోలీసు అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో వైసిపికి ఓటు వేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ హింసపై పల్నాడు ఎస్‌పికి ఫోన్‌ చేసినా స్పందించలేదన్నారు. పాల్వాయి గేటు ఘటనలో అడిషనల్‌ ఎస్‌పి సుప్రజ అక్కడే వున్నా.. హింసను నివారించలేకపోయారని అన్నారు. రహస్యంగా వుండాల్సిన వీడియో బయటకు వెళ్లినా ఎన్నికల కమిషన్‌ తమ ఆఫీసు నుండి వెళ్లలేదని బాధ్యత లేకుండా ప్రకటన చేసి ఊరుకుందన్నారు. రాష్ట్రంలో ఇసి సిఫార్సులతో నియమించిన అధికారులంతా టిడిపి కోసమే పనిచేశారని విమర్శించారు.

➡️