పేపర్‌ లీక్‌ ప్రదేశ్‌

Feb 25,2024 09:54 #Paper leak pradesh
  • యోగి సర్కార్‌పై పోలీసు అభ్యర్థుల ఆగ్రహం
  • మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్‌

లక్నో : బిజెపి ప్రభుత్వ హాయంలో ఉత్తరప్రదేశ్‌..పేపర్‌ లీక్‌ ప్రదేశ్‌గా మారిపోయిందని పలువురు నిరుద్యోగ యువత ఆగ్రహాం వ్యక్తం చేశారు. యుపిలో పోలీస్‌ కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ పేపర్‌ లీక్‌ అక్కడి అభ్యర్థులను అగమ్యగోచరంగా తయారు చేసింది. దీంతో యువత పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోంది. పేపర్‌ లీక్‌ అయిన ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. పేపర్‌ లీక్‌కు వ్యతిరేకంగా చేపట్టిన భారీ నిరసనలో భాగంగా.. లక్నోలోని ఎకో గార్డెన్‌ గ్రౌండ్‌లో ఇవే నినాదాలు ప్రతిధ్వనించాయి. ఆగ్రహానికి గురైన ఆశావహులు పలుమార్లు అసెంబ్లీ వైపు కవాతు చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఘటనా స్థలంలో ఉన్న పోలీసు సిబ్బంది నిరసన స్థలమైన ఎకో గార్డెన్‌ ప్రధాన గేటును అడ్డుకుని మూసివేశారు. అంబేద్కర్‌ నగర్‌కు చెందిన అభ్యర్థి అశ్వనీ వర్మ మాట్లాడుతూ ”పరీక్ష ప్రారంభానికి గంటల ముందు చాలా మంది అభ్యర్థులు ప్రశ్నపత్రాన్ని పొందగలిగారు. అటువంటి పరిస్థితులలో, మా కృషి ఫలించలేదు. అందుకే మేము పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నాం” అని అన్నారు. నిరసనలో భాగమైన ఆదేశ్‌, ఆకాష్‌ మాట్లాడుతూ పేపర్‌ ప్రారంభం కాకముందే దాదాపు 145 ప్రశ్నలకు సమాధానాలు వేలాది మంది అభ్యర్థులకు చేరాయనీ, ఆశావాహుల కలలు గల్లంతయ్యాయని తెలిపారు. ”మేము గత 5-6 సంవత్సరాలుగా పరీక్ష కోసం ఎదురు చూస్తున్నాం. అది జరిగినప్పుడు, పేపర్‌ లీక్‌ అయింది. చాలా సంవత్సరాలు పరీక్ష కోసం సిద్ధమైన పేద కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థి నిరాశకు గురయ్యాడు” అని ఆకాష్‌ న్యూస్‌క్లిక్‌తో అన్నారు. ఫిబ్రవరి 17, 18 తేదీల్లో జరిగిన రిక్రూట్‌మెంట్‌ పరీక్ష సోషల్‌ మీడియాలో పేపర్‌ లీక్‌ అయిందన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. పరీక్ష ప్రారంభానికి 8-12 గంటల ముందు చాలా మంది అభ్యర్థుల వద్ద పేపర్‌ ఉన్నదనీ, రూ.50,000 నుంచి రూ.2 లక్షల మధ్య ధరలో పేపర్‌ అందుబాటులో ఉన్నదని అభ్యర్థులు ఆరోపించారు. 60,244 కానిస్టేబుళ్ల పోస్టులకు దాదాపు 48 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, రిక్రూట్‌మెంట్‌ పరీక్షలో మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడినందుకు 244 మందిని అరెస్టు చేశారు. ఒక అభ్యర్థి పేపర్‌ లీక్‌ ఘటనతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పరీక్షను సరిగ్గా నిర్వహించలేక, అభ్యర్థుల ఆశలను గల్లంతు చేసిన యోగి సర్కారు ఇందుకు బాధ్యత వహించాలని కానిస్టేబుల్‌ అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇటు ప్రతిపక్ష ఎస్పీ సహా ఇతర విపక్ష పార్టీలు సైతం యోగి సర్కారుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

➡️