మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. జూనియర్లకు గుండు కొట్టిన సీనియర్లు..

Feb 14,2024 11:03 #medical students, #raging

హైదరాబాద్ : ర్యాగింగ్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా తరచుగా జూనియర్ విద్యార్థులు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లా రామగుండం వైద్య కళాశాలలో సీనియర్లు రెచ్చిపోయారు. అర్ధరాత్రి జూనియర్ల హాస్టల్ రూమ్ లలోకి చొరబడి వేధింపులకు గురిచేశారు. ఇద్దరు విద్యార్థులకు గుండ కొట్టి, మీసాలు తొలగించారు. దీంతో భయాందోళనకు లోనైన ఆ విద్యార్థులు తెల్లారి ఇంటికి వెళ్లిపోయారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీనియర్ల ఆగడాలతో విసిగిపోయిన జూనియర్ విద్యార్థులు మంగళవారం కాలేజీలో ఆందోళన చేపట్టారు. వైస్ ప్రిన్సిపాల్ ఛాంబర్ ముందు బైఠాయించారు. అయితే, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని సమాచారం. విషయం తెలిసి కాలేజీకి వెళ్లిన గోదావరిఖని పోలీసులు.. ర్యాగింగ్ ఘటనపై జూనియర్లను విచారించారు. దీనిపై తమకు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు వివరించారు.

➡️