అవినీతి కేసులో నెతన్యాహుపై విచారణ పునరుద్ధరణ

జెరూసలేం : ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుపై అవినీతి విచారణ సోమవారం పునరుద్ధరించ బడింది. హమాస్‌ దాడితో నెలకొన్న అత్యవసర పరిస్థితుల్లో ఇచ్చిన సస్పెన్షన్‌ గడువు గత వారంలో ముగియడంతో తిరిగి విచారణను చేపట్టారు. మూడేళ్ళుగా ఈ విచారణ కొనసాగుతోంది. మూడు కేసుల్లో అవినీతి, విశ్వాస ఉల్లంఘన, ముడుపులు స్వీకరించడం వంటి అభియోగాలపై విచారణను ఎదుర్కొంటున్నారు. కమ్యూనికేషన్స్‌ మంత్రిగా వున్న సమయంలో ఇజ్రాయిల్‌ టెలికం దిగ్గజ కంపెనీ బెజెక్యుకు కొన్ని ప్రోత్సాహకాలను ఇచ్చారన్నది ఒక కేసులో అభియోగం. మరో కేసులో ఇజ్రాయిల్‌ హాలివుడ్‌ నిర్మాత ఆర్నాన్‌ మిల్చాన్‌ లక్షల డాలర్ల మేర పన్నులు చెల్లించకుండా వుండేలా చూసేందుకు 2007- 2016 మధ్య కాలంలో 1,89,000 డాలర్ల విలువైన విలాసవంతమైన బహుమతులను అందుకున్నా రని ఆరోపణలున్నాయి. ముడుపుల అభియోగాలు రుజువైతే పదేళ్లవరకు జైలు శిక్ష లేదా జరిమానా పడుతుంది. అవినీతి, విశ్వాస ఉల్లంఘనలకు మూడేళ్ళ వరకు జైలుశిక్ష పడుతుంది. సిట్టింగ్‌ ప్రధానిపై విచారణ ఇదే ప్రథమం.

➡️