ఆప్‌ ప్రభుత్వం, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఎందుకు చర్చించకూడదు : సుప్రీంకోర్టు 

 న్యూఢిల్లీ  :   నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకంపై ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మధ్య వివాదంలో సుప్రీం కోర్టు శుక్రవారం జోక్యం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం మంగళవారం సమర్పించనున్న అర్హులైన అధికారుల జాబితాపై ఇరువర్గాలు చర్చించుకోవాలని ఆదేశించింది. నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేశ్‌కుమార్‌ పదవీ కాలాన్ని పొడిగించడంపై ఆప్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.  ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్‌కుమార్‌ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. అయితే, ఆయననే కొనసాగిస్తారా? లేదంటే కొత్తవారిని ఎంపిక చేస్తారా? అనే దానిపై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆప్‌ ప్రభుత్వం వాదిస్తోంది.

ఢిల్లీలో పరిపాలన సేవలపై నియంత్రణను లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు అప్పగిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన వివాదాస్పద ఆర్డినెన్స్‌ను కూడా ఆప్‌ ప్రభుత్వం సవాలు చేసింది. తమను సంప్రదించకుండా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నియమించడం సరికాదని ఢిల్లీ  ప్రభుత్వం వాదిస్తోంది.  ఢిల్లీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ వాదనలు వినిపించారు.  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఇప్పటి వరకు ఢిల్లీ ప్రభుత్వమే నియమించేదని  అభిషేక్‌ సింఘ్వీ పేర్కొన్నారు.  అయితే ఇటీవల కేంద్ర తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ పేరుతో  లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఈ నిర్ణయాన్ని ఆప్‌ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు.  కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు.

➡️