చంద్రబాబును మళ్లీ సీఎం చేయడమే లక్ష్యం

Apr 18,2024 12:24 #TDP NRI WING

ప్రత్యక్ష ప్రచారంలోకి 1500 మంది ఎన్‌ఆర్‌ఐలు
అమరావతి: గత ఐదేళ్ల పాలనలో అంథకారంలోకి వెళ్లిపోయిన రాష్ట్ర భవిష్యత్తును తిరిగి గాడిలో పెట్టడానికి చంద్రబాబును తిరిగి సీఎంను చేయడమనే లక్ష్యమని ఎన్‌ఆర్‌ఐ టీడీపీ విభాగం అధ్యక్షుడు వేమూరి రవికుమార్‌ పిలుపునిచ్చారు. ఎన్నికల క్షేత్రంలోకి దూకేందుకు ఇప్పటికే దాదాపు 1500 మంది ఎన్‌ఆర్‌ఐలు 125 దేశాల నుండి తమ స్వస్థలాలకు చేరుకున్నారు. వీరందరూ రానున్న ఎన్నికల్లో ఎలా పనిచేయాలి, ఎన్డీయే అభ్యర్ధుల విజయం కోసం ఎలా కఅషి చేయాలి, ఓటర్లను ఎలా ప్రభావితం చేయాలనే అంశాలపై టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం మంగళవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఎన్‌రీచ్‌ ఏపీ మీట్‌ నిర్వహించింది. ఎన్‌ఆర్‌ఐ టీడీపీ విభాగం అధ్యక్షుడు వేమూరి రవికుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గల్ఫ్‌ ప్రాంత కమిటీ అధ్యక్షుడు రవి రాధాకృష్ణ అధ్యక్షత వహించారు. వేమూరి రవికుమార్‌ మాట్లాడుతూ ఎన్నికల క్షేత్రంలో ప్రత్యక్షంగా పని చేసేందుకు ముందుకొచ్చిన ఎన్‌ఆర్‌ఐలకు మూడు ఆప్షన్లు ఇచ్చామనానరు. వారి సొంత నియోజకవర్గంలో పనిచేయొచ్చుననీ, లేదా సంప్రదాయంగా టీడీపీ బలహీనంగా ఉన్న రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల్లోనైనా పని చేయొచ్చునన్నారు. అదీ కాకుంటే కొన్ని కీలకమైన నియోజకవర్గాల్లో పనిచేయాలన్నారు. ఎవరు ఎక్కడ పని చేయదలుచుకుంటే అక్కడ వారికి ఎన్‌ఆర్‌ఐ టీడీపీ విభాగం అన్ని రకాలుగా సహకరిస్తుందని చెప్పారు. ముఖ్యఅతిథిగా టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్థన్‌ మాట్లాడారు. రాష్ట్రంలో కుల, మతాలకు అతీతంగా ప్రజలందరూ జగన్‌రెడ్డి ప్రభుత్వాన్ని దించాలన్నారు. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలనే దృఢమైన పట్టుదలతో ఉన్నారన్నారు. ఎన్‌ఆర్‌ఐలలో కూడా అదే పట్టుదల కనిపిస్తోందని, అందుకే ఏ ఎన్నికల్లోనూ లేని విధంగా నెల రోజుల ముందే దాదాపు 1500 మంది ఎన్‌ఆర్‌ఐలు రాష్ట్రానికి వచ్చి ఎన్డీయే అభ్యర్థుల విజయం కోసం కృషి చేయడానికి ముందుకు రావడం సామాన్య విషయం కాదన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు బ్రిటీష్‌ పాలన కన్నా అన్యాయంగా ఉన్నాయన్నారు. సహజవనరుల లూటీ జరుగుతోందని, ప్రయివేట్‌ ఆస్తులను కూడా రక్షణ లేకుండా పోయిందని, ఈ పరిస్థితిని మార్చాలంటే చంద్రబాబును మళ్లీ సీఎం చేయడం ఒక్కటే మార్గమన్నారు. చంద్రబాబు పాలనా కాలంలో ఎన్‌ఆర్‌ఐల తోపాటు రాష్ట్రంలోని ప్రజలందరి ఆస్తుల విలువ పెరిగిందని, ఈ కానీ జగన్‌రెడ్డి పాలనలో ఆయన స్వంత వ్యాపారాలు తప్ప ప్రజల ఆస్తుల విలువలు తరిగిపోయాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సి ఉందన్నారు. ఎన్నికల యుద్దంలో గెలవాలంటే ముందుగా ప్రచార యుద్ధంలో గెలవాలని, ముఖ్యంగా సోషల్‌ మీడియాలో పార్టీ భావజాలాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని, ఆ పని ఎన్‌ఆర్‌ఐలు సమర్ధవంతంగా చేయగలరన్నారు. భవిష్యత్తు కాలంలో ఎన్‌ఆర్‌ఐల ఆస్తులకు రక్షణ కావాలన్నా జగన్‌ను ఓడించాల్సిందేనన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ ఎన్నికల్లో చంద్రబాబును సీఎం చేసేందుకు కృషిచేయాలన్నారు. ఎన్నికలకు తక్కువ కాలం ఉండడంతో ఎన్‌ఆర్‌ఐలు కేంద్రీకరించి పని చేయాలని, ఒక బూత్‌నో, ఒక క్లస్టర్‌నో ఎంచుకొని ఫలితాలు వచ్చేలా కష్టపడాలని సూచించారు. చంద్రబాబు విజన్‌, కష్టపడే తత్వం కారణంగా హైదరాబాద్‌లో 20 ఏళ్లలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. ప్రత్యక్షంగా ఐదు లక్షల ఉద్యోగాలు, పరోక్షంగా 25 లక్షల మందికి ఉపాధి లభించిందని చెప్పారు. అదే చంద్రబాబు తిరిగి సిఎం అయితే హైదరాబాద్‌ లాంటి అభివృద్ధిని ఏపీలో పదేళ్లలోనే సాధించొచ్చునన్నారు. ఎన్నికల క్షేత్రంలోకి దిగుతున్న ఎన్‌ఆర్‌ఐలు ముఖ్యంగా ప్రజలకు వారి పిల్లల భవిష్యత్‌ కోసం చంద్రబాబు మళ్లీ సిఎం కావడం ఎలా అవసరమో వివరించాలన్నారు. ఎన్నికల్లో పనిచేయాలని ఎన్‌ఆర్‌ఐలు ముందుకు రావడం అభినందనీయమని, ఎన్నికల పనిలో సోషల్‌ ఇంజనీరింగ్‌ చాలా ముఖ్యమని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు. పేదరికంలో ఉన్న కుటుంబాల(బీపీఎల్‌)పై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. జగన్‌రెడ్డి విధానాల కారణంగా ఈ విభాగంలోని ప్రజలకు కూడా నష్టం జరిగినప్పటికీ తమకు డబ్బులు ఇంటికి వస్తున్నాయి కదా అనే భ్రమల్లో ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఉన్నారని చెప్పారు. ఇలాంటి భ్రమల్లో ఉన్న బీపీఎల్‌ కుటుంబాలను ఎన్‌ఆర్‌ఐలు మార్చగలిగితే పెద్ద విజయం సాధించినట్లేనన్నారు. ఎన్‌ఆర్‌ఐలు అన్ని నియోజకవర్గాల్లోకి వెళ్లి ప్రచారం చేస్తామనేది కాకుండా వారు ప్రభావితం చేయగలిగిన వారి స్వస్థలాల్లో పని చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని అశోక్‌ బాబు అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చి రామ్‌ప్రసాద్‌ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్‌ఆర్‌ఐలు అద్భుతంగా పనిచేసి టీడీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారని చెప్పారు. ఒక్క ఓటుతోనే ఎన్నికల ఫలితాలు మారిన ఘటనలు చరిత్రలో ఉన్నాయని, కాబట్టి ఎన్‌ఆర్‌ఐలు ఓటర్లను ప్రభావితం చేయడం పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఎన్‌ఆర్‌ఐ టీడీపీ యుఎస్‌ఏ నేత శేషుబాబు మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఐలు గట్టిగా పని చేసి 15 నుండి 20 నియోజకవర్గాల ఫలితాన్ని ప్రభావితం చేయాలన్నారు. ఎన్‌ఆర్‌ఐలు యువతను ఆకట్టుకునే పనిలో కృషి చేయాలని, టీడీపీ అధికారంలోకి వస్తే వారికి ఏ విధంగా మంచి జరగుతుందో వివరించి చెప్పాలన్నారు. ఎన్‌ఆర్‌ఐ టీడీపీ అమెరికా విభాగం నేత కోమటి జయరామ్‌ మాట్లాడుతూ ఒక్కో ఎన్‌ఆర్‌ఐ పది వైసీపీ కుటుంబాలను మార్చిగలినా పెద్ద ఫలితముంటుందన్నారు. ఎన్‌ఆర్‌ఐలంతా కేంద్రీకృతంగా పని చేసి ఒక్కొ నియోజకవర్గంలో వెయ్యి ఓట్లను మార్చగలిగినా చాలునన్నారు.

➡️