హామీల అమలు కోసమే సమ్మెబాట : శ్రామిక మహిళ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి

Dec 29,2023 00:12

ప్రజాశక్తి – చీరాల
మున్సిపల్ కార్మికులకు ఆదాయంతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తామని ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ అమలు చేయాలని శ్రామిక మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి కోరారు. జగనన్న నవరత్నాలు పేరుతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందడం లేదని అన్నారు. అరకొర వేతనాలు ఇస్తూ ప్రభుత్వ పధకాలకు దూరం చేశారని అన్నారు. ఎంతోమంది వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలు పెన్షన్, అమ్మవడి, భరోసా, చేయూత లాంటి సంక్షేమ పథకాలకు దూరం చేసిన పరిస్థితి ఉందని అన్నారు. ఇచ్చిన హామీల అమలు కోసం మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె 3వ రోజుకు చేరింది. కార్మికులు చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన తెలిపారు. సమ్మెకు మద్దతుగా ఆమె మాట్లాడారు. మున్సిపల్ కార్మికులు లేవనెత్తిన డిమాండ్లు కొత్తవి కాదని అన్నారు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి సంకల్ప యాత్రలో కార్మికులకు ఇచ్చిన హామీలని గుర్తు చేశారు. వాటి అమలు కోసమే సమ్మెబాట పట్టారని తెలిపారు. కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పర్మినెంట్ చేయాలని అన్నారు. పారిశుద్య కార్మికులకు అవసరమైన పనిముట్లు, రక్షణ పరికరాలు ఇవ్వడంలో విఫలం అయ్యారని అన్నారు. పుష్కట్లు రిపేరు కూడా కార్మికుల తమ సొంత డబ్బులతో చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్షులు ఎన్ బాబురావు, ఐవి ప్రసాదు, మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ పట్టణ కమిటీ నాయకులు వై సింగయ్య, ఎన్ రాజు, ఎం శంకర్, మరియమ్మ, కోటేశ్వరమ్మ, బడుగు కుమారి, విజయమ్మ, ఆంజనేయులు, సుబ్బారావు, సుబ్బమ్మ పాల్గొన్నారు. సమ్మె శిబిరానికి కాంగ్రెస్ నాయకులు ఎ పుష్పరాజు, మణిబాబు మద్దతు తెలిపారు.

➡️