శిలాజ ఇంధనాలపై తొలగని అనిశ్చితి!

Dec 13,2023 11:06 #Cop-28
  •   కాప్‌ -28 సదస్సు చివరి రోజు వాడి వేడి చర్చలు

దుబాయ్  :    కీలకమైన వాతావరణ చర్చలు ముగిసినా కీలక అంశాలపై ధనిక, వర్ధమాన దేశాల మధ్య విభేదాలు అలానే కొనసాగుతున్నాయి.దీంతో ఈ సదస్సు సాధించే ఫలితాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. భూగోళం వేడెక్కడానికి ముఖ్య కారణాల్లో ఒకటైన శిలాజ ఇంధన వాడకాన్ని తగ్గించాలనే విషయంలో ధనిక దేశాలకు, , వర్థమాన దేశాలకు మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. నవంబరు 30న ప్రారంభమైన ఈ సదస్సు దాదాపు రెండు వారాల పాటు సాగింది. వారాల తరబడి చర్చలు, ప్రసంగాలు, ప్రదర్శనలు సాగిన తర్వాత మంగళవారం మధ్యాహ్నానానికి ముగియాల్సి వుంది. కానీ, బొగ్గు, చమురు, గ్యాస్‌ వంటి శిలాజ ఇంధనాలను త్వరితగతిన తొలగించడంపై ఒక ఒప్పందం కోసం పట్టుబడుతున్న దేశాలకు సోమవారం విడుదల చేసిన ముసాయిదా ఒప్పందం ఆగ్రహం తెప్పించింది. న్యాయమైన, సక్రమమైన, సమానమైన రీతిలో శిలాజ ఇంధనాల వినిమయాన్ని, ఉత్పత్తిని తగ్గించాలని ఆ ముసాయిదా దేశాలను కోరుతోంది. ఇది పనికిమాలిన పత్రంగా ఆ ముసాయిదాను మార్షల్‌ దీవుల వాతావరణ రాయబారి టీనా స్టీగ్‌ వ్యాఖ్యానించారు. గ్లోబల్‌ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలన్న పారిస్‌ ఒప్పందం లక్ష్యాన్ని ఇది పరిష్కరించడం లేదని విమర్శించారు. ఇటువంటి చర్చల వల్ల ఎలాంటి న్యాయం జరగదని అన్నారు.

ఈ వాతావరణ మార్పులు తమ దేశ భవిష్యత్తును నాశనం చేస్తున్నాయన్నారు. దుబాయి డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం కుదరడం కష్టమేనని జర్మనీ విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించారు. అవసరమైతే సదస్సు పొడిగించినా తమకు ఇబ్బంది లేదన్నారు. కాగా, పలువురు ప్రతినిధుల వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం సవరించిన ముసాయిదాను సదస్సులో ప్రవేశపెడతారని బంగ్లాదేశ్‌ రాయబారి సాబెర్‌ చౌదరి చెప్పారు. ఏ మేరకు మెరుగుపరిచారో చూడాల్సి వుందని ఆయన వ్యాఖ్యానించారు. శిలాజ ఇంధనాలను నిర్మూలించడానికి సంబంధించిన ఏ పద ప్రయోగాన్నైనా సరే అడ్డుకోవాల్సిందిగా ఒపెక్‌ హెడ్‌ సభ్యదేశాలకు గత వారం ఒక లేఖ రాశారు. అందరికోసం ఒప్పందమనేది వుండాలని సౌదీ అరేబియా పేర్కొంటోంది. శతాబ్దాల తరబడి శిలాజ ఇంధనాల నుండి లాభాలు పొందిన సంపన్న దేశాలు ఇప్పుడు ఇలా వాటిని తిరస్కరించడమన్నది వారికి న్యాయం కాదని కొన్ని వర్ధమాన దేశాలు పేర్కొంటున్నాయి. కొన్ని కీలకమైన అంశాలపై వర్ధమాన దేశాల ఆందోళనలను పరిష్కరించడంలో ఈ ముసాయిదా విఫలమైందని చైనా పర్యావరణ మంత్రి ఝావో యింగ్‌మిన్‌ విమర్శించారు. ఇది మనుగడ కోసం జరిగే యుద్ధమని అమెరికా వాతావరణ రాయబారి జాన్‌ కెర్రీ వ్యాఖ్యానించారు.

➡️