రఫాపై వరుస బాంబు దాడులు

Apr 22,2024 08:00 #israel hamas war, #issrel
  • 14 మంది చిన్నారులతో సహా 19 మంది మృతి
  • వెస్ట్‌ బ్యాంక్‌పైనా దాడులు
  • ఇజ్రాయిల్‌కు మరో 2,600 కోట్ల డాలర్లు అందజేయనున్న అమెరికా

గాజా సిటీ: అమెరికా అండ చూసుకుని యథేచ్ఛగా చెలరేగుతున్న ఇజ్రాయిల్‌ తాజాగా దక్షిణ గాజాలోని రఫాపై పెద్దయెత్తున దాడులకు తెగబడింది. దక్షిణ గాజాలోని ఈ నగరంపై జరిపిన వైమానిక దాడుల్లో 14 మంది పిల్లలతో సహా 19 మంది చనిపోయారు. అంతకు ముందు రోజు ఇదే ప్రాంతంలో ఆరుగురు చిన్నారులతో సహా తొమ్మిది మందిని ఇజ్రాయిల్‌ సైన్యం పొట్టనబెట్టుకుంది. మరణించినవారిలో ఓ నిండు గర్భిణి కూడా ఉంది. ఆమె ప్రాణాలను కాపాడేందుకు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కానీ, ఆమె గర్భంలో ఉన్న బేబీని సురక్షితంగా బయటకు తీశామని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మరో వైపు వెస్ట్‌ బ్యాంక్‌లోని శరణార్థి శిబిరాలపైనా అది బాంబు దాడులకు తెగబడి అనేక మందిని అమానుషంగా పొట్టనపెట్టుకుంది. అదే సమయంలో అమెరికా ఇజ్రాయిల్‌కు 2, 600 కోట్ల అత్యవసర సాయాన్ని అడ్వాన్స్‌గా అందజేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను అమెరికన్‌ కాంగ్రెస్‌ శుక్రవారం ఆమోదించింది.
గత ఏడు మాసాలుగా ఇజ్రాయిల్‌ గాజాలో సాగిస్తున్న ఊచకోతలో మృతుల సంఖ్య 34 వేలు దాటింది. గాజాలోని రెండు అతిపెద్ద నగరాలు ధ్వంసమయ్యాయి. గాజా జనాభాలో 80 శాతానికి పైగా ఇళ్లను వీడి ఇతర ప్రాంతాలకు పారిపోయారు. గాజా ప్రజలకు మానవతా సాయం అందకుండా ఇజ్రాయిల్‌ అడ్డుకోవడంతో అనేక మంది చిన్నారులు, వృద్ధులు ఆకలి రక్కసిబారిన పడుతున్నారు. గాజలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలితో సహా అంతర్జాతీయ సమాజం చేస్తున్న విజ్ఞప్తులను నెతన్యాహు ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది. రఫాపై నిరంతర దాడులు చేస్తూ ఈ ప్రాంతంలో పెను విపత్తును సృష్టిస్తోంది.
ఇంకో వైపు వెస్ట్‌ బ్యాంక్‌లో పాలస్తీనా శరణార్ధి శిబిరంపై భయంకరమైన దాడులకు దిగుతోంది. పాలస్తీనీయులపైకి ఇజ్రాయిలీ సెట్లర్లచే దాడులు చేయిస్తోంది. మానవ హక్కులను కాలరాస్తోంది. ఇజ్రాయిల్‌ దాష్టీకాలకు వ్యతిరేకంగా వెస్ట్‌ బ్యాంక్‌లో పాలస్తీనీయులు పెద్దయెత్తున ఆందోళనలు చేపట్టారు. ఇదేదో ఇజ్రాయిల్‌ సైన్యంలోని ఒక చిన్న విభాగం చేసిన తప్పిదంగా చిత్రించేందుకు అమెరికా ప్రయత్నించింది. ఇజ్రాయిల్‌ రక్షణ దళానికి చెందిన నెట్టా యహుదా బెటాలియన్‌పై ఆంక్షలు విధించబోతున్నట్లు అమెరికన్‌ మీడియా ద్వారా లీకులిస్తోంది.
ఇరాన్‌ ఇజ్రాయిల్‌ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు అలానే కొనసాగుతున్నాయి. ఇజ్రాయిల్‌పై ప్రతీకార చర్య తీసుకున్న ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ను ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ ఆదివారం ప్రశంసించారు. మరోవైపు హమాస్‌ చీఫ్‌ హనీయేతో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ ఆదివారం ఇస్తాన్బుల్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈజిప్టు సరిహద్దును ఆనుకుని వున్న దక్షిణ గాజాలోని రఫాపై ఇజ్రాయిల్‌ హంతక దాడులతో తలెత్తిన పరిస్థితిపై వీరిరువురూ చర్చించినట్లు తెలిసింది.

➡️