పాలస్తీనాకు సంఘీభావంగా వెల్లువలా విద్యార్థుల ఉద్యమం

Apr 30,2024 09:13 #America, #Dharna, #palasteena, #student

న్యూయార్క్‌ : పాలస్తీనాకు సంఘీభావంగా అమెరికా యూనివర్సిటీల్లో గత రెండు వారాలుగా కొనసాగుతున్న విద్యార్థుల ఉద్యమం ఇప్పుడు యూరప్‌, ఆస్ట్రేలియాల్లోని యూనివర్శిటీలకు కూడా విస్తరించింది. ఈ ఉద్యమాల వెల్లువను చూసి బెంబేలెత్తుతున్న ఆయాదేశాల్లోని ప్రభుత్వాలు వీటిపై ఉక్కుపాదం మోపుతున్నాయి. గాజాలో ఇజ్రాయిల్‌ సాగిస్తున్న ఊచకోతను ఆపాలని, అమెరికన్లు పన్నుల రూపంలో చెల్లించన డబ్బును దురాక్రమణ దారు ఇజ్రాయిల్‌కు ఆయుధాలు, సాయం రూపంలో మళ్లించే విధానానికి స్వస్తి పలకాలని కోరుతూ విద్యార్థులు యూనివర్సిటీ కేంపస్‌లలో గుడారాలు వేసుకుని ఆందోళన సాగిస్తున్నారు. పోలీసు అణచివేత చర్యలను కూడా లెక్క చేయకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ ఆందోళనలు విస్తరిస్తున్నాయి.. ఈ దాడులు, యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహుపై దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా ఒత్తిడి పెరుగుతోంది. ప్రదర్శనలు జరుపుతున్న విద్యార్ధులపై పోలీసులు అణచివేత చర్యలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా అమెరికన్‌ యూనివర్శిటీల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. న్యూయార్క్‌ నుండి కాలిఫోర్నియా వరకు ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని చోట్ల వర్శిటీలను మూసివేసి, ఆందోళనా శిబిరాలను తొలగించారు. అమెరికా కేంపస్‌ల వ్యాప్తంగా గత రెండు వారాల్లో 900మందికి పైగా ఆందోళనకారులను అరెస్టు చేశారు. అమెరికా కేంపస్‌ల్లో ఎక్కడబడితే అక్కడ మూకుమ్మడి అరెస్టుల దృశ్యాలు సోషల్‌ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అమెరికాలో మొత్తంగా 75చోట్ల కాలేజీ కేంపస్‌ల్లో ఆందోళనా శిబిరాలు వేసి విద్యార్ధులు నిరసనలు తెలియచేస్తున్నారు. వాషింగ్టన్‌ యూనివర్శిటీ కేంపస్‌లో అరెస్టయిన వారిలో తాము వున్నామని గ్రీన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి జిల్‌ స్టెయిన్‌ తెలిపారు. వాషింగ్టన్‌ డిసి, కాలిఫోర్నియా, పిట్స్‌బర్గ్‌, బోస్టన్‌, మసాచుసెట్స్‌ల్లో కూడా పలువురు అరెస్టయ్యారు. కనెక్టికట్‌లోని యేలె యూనివర్శిటీలో వెయ్యి మందికి పైగా విద్యార్ధులు ప్రదర్శన నిర్వహించారు. చికాగో ఏరియాలో కూడా వేలాదిమంది ప్రదర్శనలో పాల్గొన్నారు.

లండన్‌లో 2లక్షల మందితో భారీ ప్రదర్శన
లండన్‌లో శనివారం దాదాపు 2లక్షల మందితో పాలస్తీనా అనుకూల ప్రదర్శన బ్రహ్మాండగా జరిగింది. పార్ల మెంట్‌ స్క్వేర్‌ వద్దకు చేరుకున్న ఆందోళనకారులు తర్వాత వైట్‌హాల్‌, డౌనింగ్‌ స్ట్రీట్‌ మీదుగా సెంట్రల్‌ లండన్‌లోని హైడ్‌ పార్క్‌ వద్దకు చేరుకున్నారు. అమెరికా సహా ప్రపంచ వ్యాప్తంగా విద్యార్ధులు చేస్తున్న నిరసనలు, ఆందోళనలతో స్ఫూర్తి పొందిన ఆందోళనకారులు లండన్‌లో ఈ మహా ప్రదర్శన తలపెట్టారు. దేశవ్యాప్తంగా ఇప్పటికి 12సార్లు ఇలాంటి మహా ప్రదర్శనలు నిర్వహించారు.

పారిస్‌లో
పారిస్‌లోప్రఖ్యాత సైన్స్‌ె పిఓ యూనివర్శిటీలో సెంట్రల్‌ కేంపస్‌ భవనాన్ని దిగ్బంధించారు. తరగతులు ఆన్‌లైన్‌లో పెట్టుకోవాలని కోరారు. కెనడాలోని మెక్‌గిల్‌ యూనివర్శిటీలో ఆందోళనలు చోటు చేసుకున్నాయి. యూదు విద్యా సంస్థలతో సంబంధాలు తెగతెంపులు చేసుకోవాల్సిందిగా డిమాండ్‌ చేశారు.

సిడ్నీలో
సిడ్నీ యూనివర్శిటీలో చారిత్రక కేంపర్‌డౌన్‌ కేంపస్‌లో విద్యార్ధులు కూడా గత వారంలో పాలస్తీనా అనుకూల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆయుధాల తయారీదారులతో సంబంధాలు తెంచుకోవాలని కోరారు. ఇటలీ, ఫ్రాన్స్‌ల వరకు ఈ ఆందోళనలు విస్తరించాయి. పాలస్తీనా కోసం సాగించే పోరాటం ఎక్కడైనా ఒక్కటేనని వారు నినదిస్తున్నారు. బైడెన్‌, ట్రంప్‌, బుష్‌, ఒబామా అందరూ కూడా యుద్ధం కొనసాగాలని కోరుకున్నవారేనని విమర్శిస్తున్నారు. నిరసన తెలియచేసే హక్కును లాగేసుకుంటున్నారని కొలంబియా విద్యార్ధి ఒకరు విమర్శించారు. పోలీసుల చర్యలతో తాము భయపడేది లేదని వారు స్పష్టం చేశారు. చాలాచోట్ల ఫ్యాకల్టీ కూడా విద్యార్ధులతో చేతులు కలుపుతోంది.

➡️