25 కిలోల బంగారంతో దొరికిన ఆఫ్ఘన్‌ దౌత్యవేత్త

May 5,2024 00:31 #afgan, #gold sized

న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్థాన్‌ దౌత్యవేత్త బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. భారత్‌లోని ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఆఫ్ఘనిస్థాన్‌ కాన్సుల్‌ జనరల్‌ జకియా వార్దక్‌ రూ.18.6 కోట్ల విలువైన 25 కేజీల బంగారాన్ని అక్రమంగా విదేశాల నుంచి భారత్‌కు తీసుకొచ్చారు. ఏప్రిల్‌ 25వ తేదీ సాయంత్రం 5:45 గంటల సమయంలో ఎమిరేట్స్‌ ఫ్లైట్‌లో కుమారుడితో కలిసి దుబారు నుంచి ఆమె భారత్‌ వచ్చారు. ముందస్తు సమాచారంతో ఎయిర్‌పోర్ట్‌ ఎగ్జిట్‌ వద్ద డిఆర్‌ఐ అధికారులు ఆమెను అడ్డుకుని, బంగారం ఇతర వస్తువులేవైనా తీసుకెళ్తున్నారా అని ప్రశ్నించారు. ఆమె అలాంటివేమీ లేవని సమాధానం చెప్పారు. అధికారులు వార్దక్‌ను ఓ గదిలోకి తీసుకెళ్లి మహిళా అధికారులతో తనిఖీలు చేయించగా, ఆమె ధరించిన జాకెట్‌, లెగ్గిన్‌, మోకాలి క్యాప్‌లో 25 బంగారు కడ్డీలు బయటపడ్డాయి. బంగారానికి సంబంధించి సరైన పత్రాలు చూపించలేకపోవడంతో, ఆ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్‌ చట్టం, 1962 కింద బంగారం స్మగ్లింగ్‌ కేసు నమోదు చేశారు. వార్దాక్‌కు దౌత్యపరమైన రక్షణ ఉండటంతో ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేయకుండా వదిలేశారు.

➡️