గాజాలో ఊచకోతకు లైసెన్స్‌ ఇచ్చింది అమెరికానే!

Mar 1,2024 11:00 #America, #Gaza

ఐరాస సహాయక సంస్థల వెల్లడి

న్యూయార్క్‌: పాలస్తీనీయులను చంపేందుకు ఇజ్రాయిల్‌కు లైసెన్స్‌ ఇచ్చింది అమెరికాయేనని ఐక్యరాజ్య సమితికి చెందిన మూడు సంస్థలు విమర్శించాయి. పాలస్తీనీయులకు మానవతా సాయం అందకుండా చేయడం, కాల్పుల విరమణకు అడ్డు పడడంలో ఇజ్రాయిల్‌కు ఎంత పాత్ర ఉందో, అమెరికాకు కూడా అంతే పాత్ర ఉందని ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యుఎఫ్‌పి), మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం (ఓసిహెచ్‌ఎ), ఆహార, వ్యవసాయక సంస్థ (ఎఫ్‌ఎఓ) చెప్పాయి. గాజాలో తాజా పరిస్థితిపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సి)కి ఈ సంస్థలు మంగళవారం ఇచ్చిన రిపోర్టులో ఈ మేరకు అభిప్రాయపడ్డాయి. గుయానా, స్విట్జర్లాండ్‌, అల్జీరియా, స్లొవేనియా అభ్యర్థన మేరకు ఐరాస భద్రతా మండలి దీనిపై ప్రత్యేక సమావేశం నిర్వహించింది. గాజాలో మొత్తం 22 లక్షల మంది పాలస్తీనీయులకు గాను చాలా మంది ఇప్పటికే ఇతర ప్రాంతాలకు శరణార్థులుగా వెళ్లిపోగా, మిగిలినవారిలో 5 లక్షల మంది ఇప్పుడు తీవ్రమైన క్షామాన్ని ఎదుర్కొంటున్నారని డబ్ల్యుఎఫ్‌పి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ కార్ల్‌ స్కువా భద్రతామండలికి తెలిపారు. ఆరేళ్లలోపు పిల్లల్లో పౌష్టికాహార లోపం చాలా తీవ్రంగా ఉందని స్కువా తెలిపారు. ఆసుపత్రులకు విద్యుత్‌, మంచినీరు సరఫరా చేయడం, పారిశుధ్య సేవలను పునరుద్ధరించడం, మానవతా సాయం సరఫరాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడడం తక్షణం చేపట్టాలని స్కువా తెలిపారు. ఇజ్రాయిల్‌ దళాలు విచక్షణా రహితంగా జరుపుతున్న వైమానిక దాడుల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ మొత్తం దెబ్బతినిపోయింది, ఆసుపత్రులను, ఐరాస సహాయక శిబిరాలను కూడా వారు వదల్లేదు. 5 మాసాలుగా సాగుతున్న ఈ దాడుల్లో గాజాలో వైద్య, ఆరోగ్య రంగానికి సంబంధించిన అన్ని మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని చెప్పారు. ఇజ్రాయిల్‌ చర్యలను అమెరికన్‌ ప్రతినిధి రాబర్ట్‌ వుడ్‌ వెనకేసుకొచ్చారు. ఐక్యరాజ్య సమితి సహాయక చర్యల సంస్థ (యుఎన్‌ఆర్‌డబ్బ్యుఎ)ను గాజాలో తిరిగి పనిచేసుకునేందుకు అనుమతించాలని చైనా, రష్యాతో సహా పలు ప్రపంచ దేశాలు డిమాండ్‌ చేశాయి.

సహాయం కోసం నిరీక్షిస్తున్న వారిపై బాంబు దాడులు : 70 మంది మృతి

వెస్ట్‌ గాజా సిటీలోని కోస్టల్‌ రోడ్డులో ఆహార పొట్లాల కోసం ఎదురు చూస్తున్న పాలస్తీనా పౌరులపై గురువారం ఇజ్రాయిల్‌ జరిపిన బాంబు దాడుల్లో 70 మంది చనిపోయారని పాలస్తీనియన్‌ వైద్య సిబ్బంది, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

➡️