కాల్పుల విరమణకు మోకాలడ్డిన అమెరికా : ఐరాసలో తీర్మానాన్ని వీటోతో అడ్డుకున్న అగ్రరాజ్యం

Dec 10,2023 10:17 #America, #superpower, #United Nations

న్యూయార్క్‌: గాజాలో ఇజ్రాయిల్‌ దాడులను ఆపడం కోసం ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది. గాజాలో తక్షణమే కాల్పుల విరమణ కోసం భద్రతా మండలిలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ శుక్రవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, మండలిలోని మొత్తం 15 సభ్య దేశాలకు గాను 13 దేశాలు దీనికి అనుకూలంగా ఓటు వేశాయి. బ్రిటన్‌ ఓటింగ్‌కు దూరంగా ఉంది. భద్రతామండలిలో అయిదు శాశ్వత సభ్యదేశాల్లో ఒకటైన అమెరికా తన వీటో అధికారాన్ని ఉపయోగించి తీర్మానాన్ని అడ్డుకుంది. కాల్పుల విరమణతో హమాస్‌ మళ్లీ పుంజుకుంటుందని ఏమాత్రం పసలేని వాదనను అమెరికా ముందుకు తెచ్చింది. అమెరికా ప్రతినిధి రాబర్ట్‌ వుడ్‌ మాట్లాడుతూ.. ‘ఈ తీర్మానం వాస్తవికతకు దూరంగా ఉంది. ఇజ్రాయిల్‌, పాలస్తీనా ప్రజలు శాంతి, భద్రతల మధ్య జీవించాలన్నదే మా అభిమతం. కాల్పుల విరమణకు అంగీకరిస్తే.. హమాస్‌ మరో యుద్ధానికి ప్రణాళిక రచిస్తుంది. శాంతిపై, రెండు దేశాల సిద్ధాంతంపై హమాస్‌కు విశ్వాసం లేదు’ అని అన్నారు. ప్రస్తుత తీర్మానంలో కొన్ని సవరణలు చేయాలని సూచించారు. తాము ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా వీటో చేయడంపై యుఎఇ తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది. గాజాలో ప్రస్తుత దారుణ పరిస్థితులను చూసి చలించిన ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ అసాధారణ అధికారాన్ని ఉపయోగించి కాల్పులవిరమణ కోసం భద్రతామండలి తక్షణమే సమావేశం కావాలని కోరారు. ఇందుకోసం ఐరాస ఛార్టర్‌లోని ఆర్టికల్‌ 99ని ఆయన ప్రయోగించారు. ఈ తీర్మానంపై గుటెరస్‌ మాట్లాడుతూ హమాస్‌ తప్పిదాలకు పాలస్తీనా ప్రజలను సామూహికంగా శిక్షించడం సరికాదని అన్నారు. తక్షణం కాల్పుల విరమణ జరిగేలా చూడాలని అన్నారు. ‘గాజా ప్రజల కష్టాలను అంతం చేయాల్సిన బాధ్యత అంతర్జాతీయ సమాజం మీద ఉంది. ప్రజల ప్రాణాలను కాపాడడానికి, వారికి మానవతా సాయం అందేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నింటిని చేయాలి. ఇజ్రాయిల్‌ దాడుల్లో ఐరాసకు చెందిన 130 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఒకే యుద్ధంలో ఐరాసకు చెందిన ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి” అని పేర్కొన్నారు.

➡️