పాలస్తీనా పూర్తి సభ్యత్వానికి మళ్లీ మోకాలడ్డిన అమెరికా

  • భద్రతా మండలి తీర్మానాన్ని వీటో చేసిన వైనం
  • పలు దేశాల ఖండన

న్యూయార్క్‌ : ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తి సభ్యత్వ గుర్తింపునిచ్చే తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది. పాలస్తీనా అభ్యర్థన మేరకు 192 దేశాలతో కూడిన ఐరాస జనరల్‌ అసెంబ్లీ ఆమోదించి పంపిన తీర్మానంపై శుక్రవారం భద్రతామండలిలో ఓటింగ్‌ నిర్వహించగా 15 మంది సభ్యులకు 12 మంది దీనికి అనుకూలంగా ఓటు వేశారు. బ్రిటన్‌, మరో దేశం ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. అమెరికా ఈ తీర్మానాన్ని వీటో చేసింది. ఈ విషయంలో తాను ఎక్కడ ఒంటరిపాటు అవుతానోనన్న దాంతో అమెరికా భద్రతా మండలిలోని రెండు దేశాలపై ఒత్తిడి తెచ్చి ఓటింగ్‌కు అవి గైర్హాజరయ్యేలా చూసుకుంది. గాజాలో ఇజ్రాయిల్‌ సాగిస్తున్న ఊచకోతకు అమెరికా వత్తాసు పలుకుతోందనడానికి ఇది మరొక నిదర్శనం. రెండు దేశాల ఏర్పాటే పాలస్తీనా సమస్యకు పరిష్కారం అన్న సూత్రానికి అనుకూలమని చెప్పే అమెరికా, ఇప్పుడీ తీర్మానాన్ని వీటో చేయడం దాని ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని పాలస్తీనా లిబరేషన్‌ అథారిటీ విమర్శించింది.
అమెరికా వీటో చేయడాన్ని ఇజ్రాయిల్‌ విదేశాంగ మంత్రి కట్జ్‌ స్వాగతించగా అనేక దేశాలు తీవ్రంగా ఖండించాయి. అమెరికా వీటోచేయడాన్ని దారుణమైన దూకుడు చర్యగా పాలస్తీనా అభివర్ణించింది. ఈ చర్యతో పాలస్తీనా ప్రాంతాన్ని మరింత అగాధంలో నెట్టేవేసిందని పాలస్తీనా అథారిటీ అధ్యక్షులు మహ్మద్‌ అబ్బాస్‌ కార్యాలయం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా చర్యను అనైతికమని, అసమర్ధనీయమని ఖండించింది. తీర్మానం ఆమోదించకపోయినా ఇదేమీ తన సంకల్పాన్ని నీరుగార్చలేదని ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనా రాయబారి రియాద్‌ మన్సూర్‌ వ్యాఖ్యానించారు. తమ ప్రయత్నాలను ఆపు చేయబోమన్నారు. పాలస్తీనా దేశం ఏర్పడడం అనివార్యమన్నారు. ఇది వాస్తవమన్నారు. ఖతార్‌, ఈజిప్ట్‌, టర్కీలు కూడా అమెరికా చర్యను తీవ్రంగా ఖండించాయి. పాలస్తీనాకు తాము అండగా వుంటామని ప్రకటించాయి. తీర్మానం విషయంలో ఇంతకన్నా భిన్నంగా వుంటుందని తాము ఊహించలేదని పేర్కొన్నాయి.

➡️