వియత్నాం యుద్ధాన్ని స్మరించుకుంటూ అమెరికా విద్యార్థుల నిరసన

May 6,2024 08:22 #American students, #Protest, #student

న్యూయార్క్‌ : గత ఆరు నెలలుగా అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్‌ సాగిస్తున్న క్రూరత్వం, గాజాలో అమాయక ప్రజలపై సాగుతున్న ఊచకోతలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలు అమెరికన్‌ క్యాంపస్‌లతో బాటు , ఇతర దేశాల విశ్వవిద్యాలయాలకు వేగంగా విస్తరిస్తున్నాయి. వియత్నాంపై అమెరికా యుద్ధానికి వ్యతిరేకంగా ఆనాడు యూనివర్సిటీ క్యాంపస్‌లు నిరసనలతో హోరెత్తాయి. మళ్లీ అటువంటి దృశ్యాలు ఇప్పుడు అమెరికా క్యాంపస్‌లంతటా కనిపిస్తున్నాయి. అమెరికన్‌ విద్యార్థులు రగిలించిన పోరాట స్పూర్తితో కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌లోని యూనివర్శిటీ విద్యార్థులు కూడా టెంట్‌లు వేసి, పోస్టర్లతో నిరసనకు దిగారు. పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దురాక్రమణ, ఊచకోతను వెంటనే ఆపాలని, ఇజ్రాయిల్‌కు ఆయుధాలు సప్లయి చేస్తున్న కంపెనీల పరిశోధనలకు యూనివర్సిటీ నిధుల మళ్లింపును నిలిపివేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ యుద్ధ వ్యతిరేక, ఊచకోత వ్యతిరేక నిరసనల్లో ప్రతిచోటా, క్రైస్తవులు, ముస్లింలు, బౌద్ధులు, హిందువులు, అలాగే అరబ్‌ ప్రపంచం, దక్షిణాసియా, ఆగేయాసియా, ఆఫ్రికా విద్యార్థులతో సహా విభిన్న జాతులు, మతాల విద్యార్థులు పాల్గొంటున్నారు. ఇజ్రాయెల్‌ విద్యార్థులు కూడా ఉన్నారు. గాజాలో ఇజ్రాయెల్‌ మారణహౌమానికి తక్షణమే స్వస్తి పలకాలన్నది అన్ని చోట్లా విద్యార్థుల ప్రధాన డిమాండ్‌. యుద్ధం వద్దు . శాంతి కావాలని వారు నినదిస్తున్నారు. నాగరిక మానవీయ సమాజం కోసం విధ్వంసానికి వ్యతిరేకంగా, శిశుహత్యలకు వ్యతిరేకంగా వారు గళమెత్తుతున్నారు.
గత ఏడు నెలలుగా ఇజ్రాయిల్‌ సాగిస్తున్న ఊచకోతలో 35వేల మంది అమాయక పాలస్తీనా పౌరులు చనిపోయారు. గాయపడిన వారి సంఖ్య కొన్ని లక్షలు. మతుల్లో 14 వేల మంది అన్నెంపున్నెం ఎరుగని పసిపిల్లలు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన చిన్నారులు 20 వేల మంది దాకా ఉన్నారు. ఆసుపత్రులు, విద్యా సంస్థలు , నివాసాలు బాంబు దాడుల్లో .పూర్తిగా నాశనమైపోయాయి. . లక్షలాది మంది నిరాశ్రయులైన పాలస్తీనా ప్రజలు తాత్కాలిక సహాయక శిబిరాల్లో ఆకలితో అలమటిస్తూ మృత్యువాత పడుతున్నారు. రఫాలోని ఈ సహాయక శిబిరాలను కూడా ఇజ్రాయెల్‌ పిశాచాలు వదలడం లేదు.భూతల దాడులకు నెతన్యాహు రంకెలేస్తున్నాడు. ఇంతటి భయంకరమైన నేరాలకు పాల్పడుతున్న ఇజ్రాయిల్‌ను అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ సహా పశ్చిమ దేశాలు నిస్సిగ్గుగా వెనకేసుకొస్తున్నాయి. ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా తీర్మానం వచ్చిన ప్రతిసారి అమెరికా దానిని అడ్డుకుంటూ వస్తోంది.
ఇజ్రాయెల్‌ ఊచకోతను వ్యతిరేకిస్తున్న టర్కీ ఆ దేశంతో వాణిజ్య సంబంధాలను తెగదెంపులు చేసుకుంది. కొలంబియా, బొలీవియా దేశాలు కూడా ఇజ్రాయిల్‌తో దౌత్య సంబంధాలను తెంచుకున్నాయి. అనేక ఇతర దేశాలు ఇజ్రాయెల్‌ను దూరంగా ఉంచాయి. భారత్‌ మాత్రం ఇప్పటికీ ఇజ్రాయిల్‌తో మిత్రత్వం నెరపుతూనే ఉంది. ఇజ్రాయిల్‌ దాష్టీకాలకు వ్యతిరేకంగా విద్యారులు సాగిస్తున్న పోరాటాన్ని అణిచివేసేందుకు పోలీసులు క్రూరమైన చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే రెండు వేల మందికి పైగా విద్యార్థులను అరెస్టు చేశారు. అణచివేత తీవ్రతరమవుతున్నకొద్దీ, విద్యార్థుల నుంచి ప్రతిఘటన కూడా అంతకు రెట్టింపు స్థాయిలో ఎదురవుతోంది. ఇప్పుడు 33 యూనివర్సిటీ క్యాంపస్‌లు నిరసనలతో అట్టుడుకుతున్నాయి..విద్యార్థుల నిరసనకు ప్రొఫెసర్లు పూర్తి మద్దతు పలుకుతున్నారు. అమెరికాలో విద్యార్థులు ఇంత విస్తతమైన నిరసనలకు దిగడం వియత్నాం యుద్ధం తరువాత ఇదే మొదటి సారి అని సీనియర్‌ ప్రొఫెసర్లు పేర్కొంటున్నారు.

➡️