సిఎఎ రాజ్యంగ విరుద్ధం : యుఎస్‌ కాంగ్రెస్‌ నివేదిక

Apr 23,2024 00:48 #CAA

వాషింగ్టన్‌ : భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) ఆ దేశ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందని అమెరికన్‌ కాంగ్రెస్‌ నివేదిక వెల్లడించింది. ముస్లింలను మినహాయించి, మూడు దేశాల్లోని ఆరు మతాలకు చెందిన వలసదారులకు పౌరసత్వం మంజూరు చేసే సిఎఎలోని కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని కొన్ని నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని కాంగ్రెషనల్‌ రీసెర్చ్‌ సర్వీస్‌ (సిఆర్‌ఎస్‌) తన ‘ఇన్‌ ఫోకస్‌’ అనే నివేదికలో పేర్కొంది. మతపరంగా మెజార్టీలను మాత్రమే రక్షించడానికి రూపొందించిన సిఎఎ మైనారిటీలకు ఉపయోగపడదని విమర్శించిన నివేదిక.. లౌకిక భారతదేశాన్ని నాశనం చేయడానికి మోడీ, బిజెపి ప్రయత్నిస్తున్నాయని విమర్శలను ప్రస్తావించింది. 2019లో ఈ పౌరసత్వ సవరణ బిల్లును భారత పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు ఆ దేశంలో ఉన్న అమెరికా దౌత్యవేత్త ఆందోళన వ్యక్తం చేసినట్లు కూడా నివేదిక గుర్తు చేసింది. సిఆర్‌ఎస్‌ అనేది యుఎస్‌ కాంగ్రెస్‌ యొక్క స్వతంత్ర పరిశోధనా విభాగం. యుఎస్‌ కాంగ్రెస్‌ నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడే అధ్యయనాలు, నివేదికలను అందిస్తుంది. ఈ నివేదికలను యుఎస్‌ కాంగ్రెస్‌ అధికారిక అభిప్రాయంగా పరిగణించరు. బైడెన్‌ ప్రభుత్వం ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టం నోటిఫికేషన్‌పై తన ఆందోళనలను వ్యక్తం చేసింది ఈ వివాదాస్పద చట్టం అమలును నిశితంగా పరిశీలిస్తామని తెలిపింది.

➡️