రష్యాతో బంధం నిరంతరం బలోపేతం : జిన్‌పింగ్‌

Jan 2,2024 10:53 #Xi Jinping

బీజింగ్‌: రష్యాతో సంబంధాలను నిరంతరం బలోపేతం చేసుకోవడం, విస్తరింపజేయడం రెండు దేశాల ప్రాథమిక ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని చైనా అధ్యక్షుడు సీ జిన్‌పింగ్‌ ఉద్ఘాటించారు. గత మూడేళ్లలో చైనా-రష్యా ద్వైపాక్షిక సంబంధాలు, సమగ్ర వ్యూహాత్మక సమన్వయం బాగా మెరుగుపడ్డాయని ఆయన చెప్పారు. నూతన సంవత్సర ప్రారంభ సందర్భంగా పుతిన్‌, జిన్‌పింగ్‌ పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా జిన్‌ పింగ్‌ మాట్లాడుతూ చైనా ప్రభుత్వం, ప్రజల తరపున పుతిన్‌కు, రష్యన్‌ ప్రజలకు హదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాల గురించి ప్రస్తావిస్తూ ఒక శతాబ్దంలో కనపడని మార్పులు గత దశాబ్దంలో కనిపించాయని అన్నారు. ప్రపంచ ఆర్థిక మాంద్యం, ప్రాంతీయ అస్థిర పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో తమ ఇరు దేశాల మధ్య సంబంధాలు ఆరోగ్యకరంగాను, సుస్థిరంగాను కొనసాగిస్తున్నాయని, 2023లో సరైన దిశలో పయనించాయని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. మాస్కో, బీజింగ్‌లో జరిగిన రెండు ఉన్నత స్థాయి సమావేశాల్లో ద్వైపాక్షిక సంబంధాలతో బాటు ఉమ్మడి ఆందోళన కలిగించే ప్రధాన అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలపై విస్తత ఏకాభిప్రాయానికి వచ్చామని చైనా నేత చెప్పారు.వార్షిక ద్వైపాక్షిక వాణిజ్య పరిమాణం షెడ్యూల్‌ కంటే ముందే 20వేల కోట్ల యుఎస్‌ డాలర్ల లక్ష్యాన్ని చేరుకుందని అన్నారు. 2024-2025 చైనా -రష్యాల దౌత్య సంబంధాల స్థాపన 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి సాంస్కతికోత్సవాలను నిర్వహించాలని తాము నిర్ణయించామని అన్నారు.

➡️