కృతిమ మేధతో ఎన్నికల్లో జోక్యం

– చైనాపై మైక్రోసాఫ్ట్‌ ఆరోపణలు
న్యూయార్క్‌ : భారత్‌లో సార్వత్రిక ఎన్నికల వేళ చైనాపై అమెరికాకు చెందిన టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సంస్థ అసంబద్ధమైన ఆరోపణలు గుప్పించింది. భారత్‌ సహా అమెరికా, దక్షిణ కొరియా ఎన్నికల ప్రక్రియలో కృత్రిమ మేధ (ఎఐ)తో జోక్యం చేసుకునేందుకు చైనా ప్రయత్నిస్తోందని ఆరోపించింది. దాదాపు 64 దేశాల్లో ఈ ఏడాది కొత్తగా ప్రభుత్వాలు కొలువుదీరనున్నాయని, ఈ నేపథ్యంలో ఎఐతో జోక్యానికి అవకాశాలున్నాయని మైక్రోసాఫ్ట్‌ థ్రెట్‌ అనాలసిస్‌ సెంటర్‌ జనరల్‌ మేనేజర్‌ క్లింట్‌ వాట్స్‌ బ్లాగ్‌ పోస్టు పెట్టారు. ఓటర్ల మధ్య పలు అంశాల్లో విభజన తీసుకొచ్చి, అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తనకు అనుకూలంగా వచ్చేలా నకిలీ ఖాతాలను చైనా ఉపయోగిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా తన లక్ష్యాల సాధనకు ఉత్తర కొరియాతో కలిసి చైనా ఎఐ వినియోగాన్ని పెంచిందని పేర్కొన్నారు. ఇటీవల ప్రధాని మోదీ, మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ భేటీ అయిన కొన్ని రోజుల తర్వాత మైక్రోసాఫ్ట్‌ నుంచి ఎఐపై హెచ్చరికలు రావడం గమనార్హం.

➡️