ఇజ్రాయిల్‌ సాయుధ దళాలకు ఆహార సరఫరా నిలిపేయాలి

Jan 26,2024 11:29 #Israel
Food supply to Israel armed forces should be stopped

 మానవతావాద సంస్థల కూటమి పిలుపు

జెరుసలేం : ఇజ్రాయిల్‌ సాయుధ దళాలకు ఆహార, నిత్యావసర వస్తువుల సరఫరాను నిలిపివేయాలని 16 సంస్థలతో కూడిన మానవతావాద సంస్థల కూటమి పిలుపునిచ్చింది. ఈ కూటమిలో అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌, ఆక్సాఫామ్‌, సేవ్‌ ది చిల్డ్రన్‌, నార్వేజియన్‌ రెఫ్యూజీ కౌన్సిల్‌.. వంటి మానవతావాద సంస్థలు ఉన్నాయి. గాజాలో పరిస్థితి పూర్తిగా నిరాశాజనకంగా ఉందని ఈ కూటమి ఆందోళన వ్యక్తం చేసింది. గాజా జనాభాలో ప్రతీ 25 మందిలో ఒకరు చనిపోవడం, లేదా గాయపడటం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. అన్ని దేశాలు తక్షణమే ఇజ్రాయిల్‌ సాయుధ దళాలకు ఆయుధాలు, ఆయుధ సామగ్రి, మందుగుండు సరఫరాను నిలిపివేయాలని విజ్ఞప్తి చేసింది. ఇలాంటి వస్తువుల సరఫరాతో అంతర్జాతీయ మానవ హక్కుల నిబంధనలను ఉల్లంఘించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇజ్రాయిల్‌ బాంబు దాడులు, అక్రమణల కారణంగా గాజా నివాసయోగ్యం కాకుండా పోతుందని, ప్రస్తుతం గాజాలో జనాభా గతంలో ఎన్నడూ చూడని మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని కూటమి ఆవేదన వ్యక్తం చేసింది.

ఇజ్రాయిల్‌ మారణకాండపై నేడు ఐసిజె తీర్పు

హేగ్‌ : గాజాలో ఇజ్రాయిల్‌ మారణహోమం కేసులో ఐరాసకు చెందిన అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె) శుక్రవారం తీర్పును వెల్లడించనుంది. గాజాలో మారణహోమానికి పాల్పడుతున్న ఇజ్రాయిల్‌పై చర్యలు తీసుకోవాలని ఐసిజెలో గత ఏడాది డిసెంబరు 29న దక్షిణాఫ్రికా కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో వాదనలు రెండు వారాల క్రితమే ముగిశాయి. పాలస్తీనాలో ఒక యావత్తు జాతిని నిర్మూలించడానికి ఇజ్రాయిల్‌ నెలల తరబడి దాడులు కొనసాగిస్తుందని, దీనిని మారణ హోమంగా భావించాలని దక్షిణాఫ్రికా వాదనలు వినిపించింది. పాలస్తీనా ప్రజలపై కొనసాగుతున్న కోలుకోలేని దాడుల నుంచి రక్షించడానికి అత్యవసర చర్యలను సూచించాలని కూడా దక్షిణాఫ్రికా ఐసిజెను అభ్యర్థించింది.

➡️