హెలికాప్టర్‌ కూలి చిలీ మాజీ అధ్యక్షుడు పినేరా మృతి

చిలీ : చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్‌ పినేరా (74) హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు. ఈ విషయాన్ని ఆయన కార్యాలయం ధ్రువీకరించింది. పినేరా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ దక్షిణ చిలీలోని ఓ సరస్సులో కూలిపోయింది. ఈ ప్రమాదంలో పినేరా మృతి చెందగా, మిగతావారు గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగినపుడు హెలికాప్టర్‌లో పినేరాతో పాటు మరో ముగ్గురు ఉన్నారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌ను పినేరా స్వయంగా నడిపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని అధికారికంగా ధ్రువీకరించలేదు. పినేరా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చిలీ ఆర్మీ ప్రకటించింది. కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన పినేరా మొదట 2010 నుంచి 2014 వరకు, రెండోసారి 2018 నుంచి 2023 వరకు చిలీ దేశాధ్యక్షుడిగా ఉన్నారు. బిలియనీర్‌ అయిన ఆయన చిలీలోని అత్యంత ధనికుల్లో ఒకరిగా ఉన్నారు. ఆయన మృతి పట్ల దక్షిణ అమెరికా దేశాధినేతలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

➡️