ఫ్రాన్స్‌ ఎన్నికలు

Jun 30,2024 23:41 #elections, #french

మొదటి రౌండ్‌లో 69శాతం పోలింగ్‌
పారిస్‌: ఆదివారం జరిగిన ఫ్రాన్స్‌ పార్లమెంటు ఎన్నికల మొదటి రౌండ్‌ పోలింగ్‌లో 69 శాతం దాకా ఓట్లు పోలయ్యాయి. 2022 ఎన్నికలతో పోల్చితే ఓటింగ్‌ శాతం 20శాతానికి పైగా పెరిగింది. రెండో రౌండ్‌ పోలింగ్‌ ఈ నెల7న జరగనుంది. యూరోపియన్‌ యూనియన్‌ పార్లమెంటు ఎన్నికల్లో అధ్యక్షుడు మాక్రాన్‌ నేతృత్వంలోని రినైజాన్స్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలడం, మేరీ లీపెన్‌ నాయకత్వంలోని పచ్చి మితవాద పార్టీ నేషనల్‌ ర్యాలీ (ఆర్‌ఎన్‌) బాగా పుంజుకోవడంతో మాక్రాన్‌ పార్లమెంటును రద్దు చేసి ఆకస్మిక ఎన్నికలను ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీల ఆక్రమణ తరువాత మొదటి సారి ఫ్రాన్స్‌లో పచ్చి మితవాద పార్టీ అధికారాన్ని చేజిక్కించుకునే స్థాయికి ఎదిగింది. దీనిని సవాల్‌ చేస్తూ ఫ్రాన్స్‌లోని వామపక్ష, ప్రగతిశీల, ప్రజాతంత్ర శక్తులన్నీ కలసి న్యూ పాపులర్‌ ఫ్రంట్‌ గా ఏర్పడ్డాయి. ఇటీవల బ్రహ్మాండమైన ర్యాలీ కూడా నిర్వహించాయి. మొదటి రౌండ్‌లో పోలింగ్‌ శాతం పెరగడానికి ‘ఫ్రాన్స్‌ భవిష్యత్తు ‘ గురించి ఆందోళన చెందుతున్న సెక్షన్ల ప్రజలు ఇంట్లో నుంచి పెద్ద సంఖ్యలో బయటకు రావడమే కారణమని ఎన్నికల విశ్లేషకులు పేర్కొంటున్నారు. మేరీ లీపెన్స్‌ విజయం అంత తేలికేమీ కాదని, పాపులర్‌ ఫ్రంట్‌ నుంచి అది గట్టి సవాల్‌ ఎదుర్కొంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.

➡️