California వర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత

లాస్‌ఏంజెలిస్‌ (అమెరికా) : పాలస్తీనా – ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధ వాతావరణం… యూనివర్సిటీలకు వ్యాపించింది. దేశ వ్యాప్తంగా పలు యూనివర్సిటీలలో పాలస్తీనా వర్గ విద్యార్థులు – ఇజ్రాయెల్‌ వర్గ విద్యార్థుల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నారు.

పాలస్తీనా-ఇజ్రాయెల్‌ అనుకూల వర్గాల మధ్య ఘర్షణ..
లాస్‌ ఏంజెలిస్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ క్యాలిఫోర్నియాలో పాలస్తీనా అనుకూల వర్గాలు ఆక్రమించుకుని తమను లోపలికి రానివ్వడం లేదని ఇజ్రాయెల్‌ అనుకూల విద్యార్థులు ఆరోపించారు. పాలస్తీనా, ఇజ్రాయెల్‌ అనుకూల వర్గాల విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణలు రాజుకుంటున్నాయి. బైడెన్‌ ప్రభుత్వ ఇజ్రాయెల్‌ అనుకూల విధానాలను నిరసిస్తూ పాలస్తీనా వర్గం వర్సిటీలో టెంట్లు వేసుకుని నిరసనలను సాగిస్తున్న సంగతి తెలిసిందే. హెల్మెట్లు, మాస్కులు ధరించిన కొందరు కర్రలు చేతపట్టుకుని మంగళవారం అర్ధరాత్రి ఆ టెంట్లపైకి దాడి చేశారు. బాణసంచా కూడా కాల్చినట్టు లాస్‌ఏంజెలెస్‌ టైమ్స్‌ తెలిపింది. ఇరువర్గాలవారు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కుర్చీలతోపాటు అందిన వస్తువులను విసురుకున్నారు.

పాలస్తీనా అనుకూల విద్యార్థులు అరెస్టు ….
హింసాత్మక ఘటనల కారణంగా వర్సిటీలో బుధవారం తరగతులు రద్దయ్యాయి. సోమవారం కొలంబియా వర్సిటీ కూడా ఈ ఘర్షణలకు వేదికవడం తెలిసిందే. హామిల్టన్‌ హాల్‌లో దాదాపు 20 గంటలపాటు తిష్టవేసిన పాలస్తీనా అనుకూల విద్యార్థులను పోలీసులు బలవంతంగా బయటకు పంపించారు. వర్సిటీతోపాటు సిటీ కాలేజీలో ఆందోళనలకు దిగిన దాదాపు 300 మందిని అరెస్టు చేశారు. నార్తర్న్‌ ఆరిజోనా యూనివర్సిటీలో టెంట్లు వేసి నిరసన సాగిస్తున్న పాలస్తీనా అనుకూల విద్యార్థులను పోలీసులు ఖాళీ చేయించారు.

ఆందోళనకారుల డిమాండ్‌కు తలగ్గిన యూనివర్సిటీ…
కొద్ది వారాలుగా అమెరికాలోని పాలస్తీనా, ఇజ్రాయెల్‌ విద్యార్థుల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్నాయి. రోడ్‌ ఐలాండ్స్‌ క్యాంపస్‌లో ఆందోళన చేస్తున్న పాలస్తీనా అనుకూల విద్యార్థి వర్గంతో, బ్రౌన్‌ యూనివర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే అక్టోబర్‌ నుంచి వర్సిటీలోకి ఇజ్రాయెల్‌ వ్యక్తుల పెట్టుబడులను స్వీకరించకూడదు అని ప్రధాన షరతు. ఆందోళనకారుల డిమాండ్‌కు ఇలా ఒక యూనివర్సిటీ తలగ్గడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారని చెబుతున్నారు !

➡️