శ్రీలంకకు ఐఎంఎఫ్‌ రెండో విడత రుణం

Dec 14,2023 09:21 #IMF, #Sri Lanka
imf aid to srilanka

కొలంబో : శ్రీలంకకు రెండవ విడత రుణాన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) సంస్థ మంజూరు చేసింది. విస్తరించిన రుణ సదుపాయం (ఇఎఫ్‌ఎఫ్‌) కింద 33.7కోట్ల డాలర్ల రుణాన్ని అందచేయనుంది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక ప్రభుత్వం, ద్వైపాక్షిక పరపతిదారులు రూపొందించిన రుణ ప్రణాళిక ప్రాతిపదికగా ఈ రుణం మంజూరైంది. ఇఎఫ్‌ఎఫ్‌ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగానే శ్రీలంక, ఎక్స్‌పోర్ట్‌-ఇంపోర్ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా, అధికారిక రుణదాతల కమిటీతో కుదుర్చుకున్న ఒప్పందాలు వున్నాయి. సుస్థిరత దిశగా శ్రీలంక ప్రయాణంలో ఇది కీలకమైన మైలురాయని వాషింగ్టన్‌ డిసి సీనియర్‌ అధికారి వ్యాఖ్యానించారు. ఐఎంఎఫ్‌ నుండి మొత్తంగా 300కోట్ల డాలర్లు రుణంగా అందుకోవాల్సి వుండగా, అందులో ఈ రెండో విడతను కలుపుకుంటే ఇప్పటివరకు 67కోట్ల డాలర్ల రుణం అందుకుంది. నవంబరులో భారత్‌, పారిస్‌ పరపతిదారుల క్లబ్‌తో శ్రీలంక సూత్రప్రాయంగా ఒప్పందం కుదుర్చుకుంది. తాము ఇచ్చిన రుణాలను కూడా పోల్చదగిన నిబంధనలతో పరిగణించేందుకు అంగీకరించినట్లు చైనా కూడా తెలిపింది.

➡️