Indonesia: మరోసారి బద్ధలైన రువాంగ్‌ అగ్నిపర్వతం .. విమానాశ్రయం మూసివేత

జకార్తా : ఇండోనేషియాలో రువాంగ్‌ అగ్నిపర్వతం నుండి రాళ్లు, లావా, బూడిద వెదజల్లడంతో అప్రమత్తమైనట్లు గురువారం అధికారులు తెలిపారు. సమీపంలోని వందలాది మంది ప్రజలను ఖాళీ చేయించామని, విమానాశ్రయాన్ని కూడా మూసివేసినట్లు వెల్లడించారు. సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో ఆ ప్రాంతంలో ప్రభుత్వం హైఅలర్ట్‌ ప్రకటించింది.

ఉత్తర సులవేసి ప్రావిన్స్‌లోని మారుమూల ప్రాంతంలో ఉండే ఈ అగ్నిపర్వతం బుధవారం మరోసారి విస్ఫోటనమైనట్లు అధికారులు తెలిపారు. దీంతో లావా, రాళ్లతో పాటు ఆకాశంలో సుమారు మూడు కిలోమీటర్ల మేర బూడిద కమ్మేసింది. సుమారు 800 మందికి పైగా ఆ ప్రాంతం నుండి తరలించామని, అగ్నిపర్వత సంస్థ హెచ్చరికల మేరకు తరలింపు జోన్‌ను మరింత పెంచినట్లు తెలిపారు.

హైరిస్క్‌ ఉన్న ప్రాంతాల్లో సుమారు 1, 500 మందిని తరలించాల్సి వుందని, సుమారు 12,000 మంది ప్రభావితమౌతారని అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా పలు విమానయాన సంస్థలు విమానాలను రద్దు చేశాయి.

➡️