ఐర్లాండ్‌ ప్రధాని రాజీనామా

Mar 21,2024 08:06 #Ireland, #prime minister, #resignation

డబ్లిన్‌ : ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఐర్లాండ్‌ ప్రధాని లియో వరాద్‌కర్‌ (45) బుధవారం ప్రకటించారు. తన వారసుడిని ఎన్నుకున్న అనంతరం తన రాజీనామా వుంటుందని తలెఇపారు. ఐర్లాండ్‌ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన మధ్యే మితవాద పార్టీ ఫైన్‌ గేల్‌ పార్టీ చీఫ్‌గా తక్షణమే వైదొలగుతున్నట్లు ప్రకటించారు. పార్టీ నాయకత్వ పోటీ తర్వాత ప్రధాని పదవి నుండి వైదొలగనున్నారు. తన ఈ రాజీనామాకు వ్యక్తిగత, రాజకీయ కారణాలున్నాయని చెప్పారు. ఇప్పటికైతే తన భవిష్యత్‌ ప్రణాళికలు ఏవీ లేవన్నారు. పార్లమెంట్‌లో వెనుక బెంచీల్లో కూర్చునే ఎంపీగా కొనసాగుతానని తెలిపారు. లియో ఇప్పటికి రెండుసార్లు ప్రధాని బాధ్యతలు నిర్వర్తించారు. 2017-2020 మధ్య కాలంలో ఒకసారి, 2022 డిసెంబరు నుండి రెండోసారి ప్రధాని పదవిని చేపట్టారు. మొదటిసారి ప్రధాని పదవికి ఎన్నికైనపుడు లియో దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా రికార్డు సృష్టించారు. అలాగే ఐర్లాండ్‌ మొదటి గే ప్రధాని కూడా, ఆయన ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు. లియో వరాద్‌కర్‌ తల్లి ఐరిష్‌ కాగా, తండ్రి భారతీయుడు. 2015లో స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేయడంలో కీలక పాత్ర పోషించిన లియో గర్భస్రావంపై నిషేధాన్ని రద్దు చేశారు. దేశాన్ని మరింత సమానంగా, మరింత ఆధునికంగా రూపొందించగలిగానని గర్వంగా చెప్పుకుంటానని లియో తన రాజీనామా ప్రకటనలో వ్యాఖ్యానించారు. పార్టీలో తీవ్ర అసమ్మతిని లియో ఎదుర్కొంటున్నారు.

➡️