దక్షిణ గాజాపై దాడులను ఉధృతం చేసిన ఇజ్రాయిల్‌

Dec 29,2023 17:12 #Gaza, #israel hamas war

గాజా   :    ఇజ్రాయిల్‌ పాలస్తీనాపై దాడులను ఉధృతం చేసింది. ఇప్పటికే ఇజ్రాయిల్‌ యుద్ధంతో గాజాలోని జనాభాలో 85 శాతం (సుమారు 2.3 మిలియన్ల ) మందిని నిరాశ్రయులయ్యారు. దక్షిణ గాజాపై వైమానిక, భూతల దాడులను తీవ్రతరం చేసినట్లు శుక్రవారం ఇజ్రాయిల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ (ఐడిఎఫ్‌) తెలిపింది. దీంతో నివాసాలను వీడిన వేలాది మంది పాలస్తీనియన్లు రఫా సరిహద్దుకు చేరుకున్నారని,ఈ ప్రాంతమంతా రద్దీగా మారినట్లు ఐక్యరాజ్యసమితి (యుఎన్‌) తెలిపింది.

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 1.20కి ఇజ్రాయిల్‌ డమాస్కస్‌ సమీపంలోని పలు ప్రాంతాలే లక్ష్యంగా వైమానిక దాడులు జరిపిందని సిరియాకి చెందిన సనా న్యూస్‌ ఏజన్సీ తెలిపింది. గురువారం రాత్రి చేపట్టిన ఈ దాడులతో దక్షిణాది ప్రాంతంలో ఆస్తినష్టం ఏర్పడిందని వెల్లడించింది. డమాస్కస్‌ విమానశ్రయంపై దాడి జరిగిందని బ్రిటన్‌కి చెందిన సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ నివేదిక తెలిపింది. ఇటీవల దాడుల కారణంగా రెండు నెలల పాటు విమానాశ్రయంలో నిలిచిపోయిన సేవలు గురువారం తిరిగి ప్రారంభమయ్యాయని, అదే రోజు దాడి జరిగినట్లు పేర్కొంది. డమాస్కస్‌ గ్రామీణ ప్రాంతంలోని సిరియన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ శిబిరం మరియు దక్షిణ ప్రావిన్స్‌ ఆఫ్‌ స్వీడియాలోని సైనిక శిబిరాలపై దాడులు జరిగినట్లు తెలిపింది. ఈ దాడుల్లో ఇద్దరు సైనికులు గాయపడినట్లు ప్రకటించింది.

➡️