ఇజ్రాయిల్‌ మరో దాష్టీకం

Apr 12,2024 08:20 #4 death, #issrel
  •  హమాస్‌ చీఫ్‌ ముగ్గురు కుమారులు, నలుగురు మనవళ్ల హత్య

గాజాసిటీ: ఈద్‌ ఉల్‌ ఫితర్‌ సందర్భంగా హమాస్‌ రాజకీయ విభాగం అధిపతి ఇస్మాయిల్‌ హనియే ముగ్గురు కుమారులను, నలుగురు మనవళ్లను యూదు దురహంకార సైన్యం బుధవారం అమానుషంగా పొట్టనబెట్టుకుంది. నాజీలను తలపిస్తున్న ఇజ్రాయిల్‌ ఆర్మీ చర్యపె అంతర్జాతీయంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈద్‌ సందర్భంగా గాజా సిటీని సందర్శించేందుకు హనీయే ముగ్గురు కుమారులు, నలుగురు మనవళ్లు కారులో వెళ్తుండగా ఇజ్రాయిల్‌ ఆర్మీ ఆ వాహనంపై బాంబులు వేసంది. ఈ దాడిలో కారు మొత్తం తునాతునకలైంది.
అందులో ప్రయాణిస్తున్న వారంతా చనిపోయారు. ఇజ్రాయిల్‌ దుర్మార్గాన్ని పాలస్తీనా ఇస్లామిక్‌ జిహాద్‌, ముజాహిద్డీన్‌ మూవ్‌మెంట్‌, అన్సర్‌ అల్లా తదితర సంస్థలు తీవ్రంగా ఖండించాయి. నాజీ సేనల పిరికిపంద చర్యగా దీనిని అభివర్ణించాయి. దీనిపై హనీయే స్పందిస్తూ, తన పిల్లలను చంపడం వల్ల హమాస్‌ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదని అన్నారు. గాజా కోసం పోరాటంలో ఎంతో మంది రక్తతర్ఫణం చేస్తున్నారని, వారి రక్తం కన్నా తన పిల్లల రక్తం విలువ ఎక్కువేమీ కాదని అన్నారు. పాలస్తీనా పూర్తి స్వాతంత్య్రం కోసం హమాస్‌ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. రఫాపై ఇజ్రాయిల్‌ దాడి మమ్మల్నేమీ భయపెట్టలేదని, దీనికి దీటుగా బదులిస్తామని హమాస్‌ నేత అన్నారు.
హమాస్‌ నాయకుడి పిల్లలు, నలుగురు మనవళ్లను చంపిన పాశవిక చర్యకు బాధ్యత వహించకుండా తప్పించుకోవడానికి ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రయత్నిస్తున్నారు. తనకు సమాచారం ఇవ్వకుండా సైన్యం ఈ ఆపరేషన్‌ నిర్వహించిందని ఆయన ఇజ్రాయెల్‌ మీడియాకు చెప్పారు. ఇస్మాయిల్‌ హనీయె అమీర్‌, మహ్మద్‌ అబెల్‌, హజీమ్‌ హనీయేలను, వారి పిల్లలను లక్ష్యంగా చేసుకున్నారని వారు హమాస్‌ యోధులని హమాస్‌ పేర్కొంది.
యుద్ధాన్ని విరమించాలంటూ ఇజ్రాయెల్‌లో పెద్దయెత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. మరో వైపు కాల్పుల విరమణకు సంబంధించి చర్చలు ఒక కొలిక్కి వస్తున్న తరుణంలో ఇజ్రాయిల్‌ ఈ హత్యాకాండకు పాల్పడడాన్ని బట్టి శాంతియత్నాలకు గండి కొట్టాలన్నదే నెతన్యాహు ప్రభుత్వ వైఖరిగా ఉందని అర్థమవుతోందని అంతర్జాతీయ విశ్లేషకులు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. హమాస్‌ చీఫ్‌ కుటుంబ సభ్యుల హత్య ఘర్షణను మరింత తీవ్రతరం చేస్తుందని ఇజ్రాయెల్‌ పౌరులు ఆందోళన చెందుతున్నారు.
 ఈద్‌ రోజున కూడా గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు ఆగలేదు. ఇజ్రాయెల్‌ దక్షిణ గాజాలోని రఫా శిబిరం, మధ్య ప్రాంతంలోని నుసెరాత్‌ శిబిరంపై దాడి చేసింది. యూనిసెఫ్‌ రిలీఫ్‌ కాన్వారుపై ఇజ్రాయెల్‌ సైన్యం గురువారం విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. అంతకుముందు, ఇజ్రాయెల్‌ దాడిలో అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ సహాయక సిబ్బంది చనిపోయారు. ఆరు మాసాలుగా సాగిస్తున్న ఈ దాడుల్లో 34,000 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.

➡️