రఫాలో అర్ధరాత్రి పూట ఇజ్రాయిల్‌ దాడులు

Feb 5,2024 10:25 #Attacks, #Israel, #Syria
Israel strikes at midnight in Rafah

 92 మంది మృతి

జెరుసలేం : గాజాపై ఇజ్రాయిల్‌ పాశవిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అర్ధరాత్రి సమయంలో కూడా ఇజ్రాయిల్‌ దాడులకు పాల్పడుతుందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తాజాగా శుక్రవారం అర్ధరాత్రి ఇజ్రాయిల్‌ చేసిన దాడుల్లో 92 మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చిన్నారులు, మహిళలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇజ్రాయిల్‌ దాడుల కారణంగా నిరాశ్రయులైన పాలస్తీనీయులు తలదాచుకుంటున్న శిబిరంపైనే ఈ దాడుల జరగడం విచారకరం. పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ వివరాలను వెల్లడించింది. గాజాపై ఇజ్రాయిల్‌ దాడులు ఆదివారం నాటికి 122 రోజుకు చేరుకున్నాయి. ఇప్పటి వరకూ 27 వేలకు పైగా పాలస్తీనీయులు ఈ దాడుల్లో మరణించారు. వీరిలో పిల్లలు, మహిళలే అధికంగా ఉన్నారు.

ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రదర్శనలు

మరోవైపు గాజాలో ఇజ్రాయిల్‌ దాడులకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌, జర్మనీల్లో శనివారం జరిగిన ప్రదర్శనల్లో వేలాదిమంది పాల్గొన్నారు. గాజాలో తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. నెతన్యాహు ప్రభుత్వం రాజీనామా చేయాలని, ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని ఇజ్రాయిల్‌లోని టెల్‌ అవీవ్‌లో శనివారం వేలాదిమంది ఆందోళన నిర్వహించారు.

సిరియా, యెమెన్‌లో 36 లక్ష్యాలపై బాంబు దాడులు

అమెరికా, బ్రిటన్‌ ఇతర సామ్రాజ్యవాద దేశాలు సిరియా, యెమెన్‌లలో 36 లక్ష్యాలపై వైమానిక, నావికా దాడులు చేశాయి. ఎర్ర సముద్రంలోని నౌకలపై హౌతీ క్రూయిజ్‌ క్షిపణులను ప్రయోగించడాన్ని సాకుగా చూపి యెమెన్‌లోని ఆరు ప్రదేశాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. దీనికి అమెరికా మూల్యం చెల్లించుకోకతప్పదని హౌతీలు హెచ్చరించారు. ”గాజాపై దురాక్రమణ ఆపేంతవరకు యూదు దురహంకార ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా మా సాయుధ పోరాటం కొనసాగుతుందని హౌతీ తిరుగుబాటుదారు గ్రూపు నాయకులొకరు తెలిపారు. గత ఏడాది అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌-హమాస్‌ వివాదం చెలరేగినప్పటి నుంచి పాలస్తీనియన్లకు సంఘీభావంగా యెమెన్‌ హౌతీ తిరుగుబాటుదారులు ఈ ప్రాంతంలో షిప్పింగ్‌పై దాడి చేస్తున్నారు. మొదట్లో ఇజ్రాయెల్‌ అనుబంధ నౌకలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని, యెమెన్‌పై సంకీర్ణ దాడులు ప్రారంభించిన తర్వాత హౌతీలు అమెరికా, బ్రిటన్‌కు చెందిన నౌకలపై దాడులకు సిద్ధమయ్యాయి.

➡️